టీ20 ప్రపంచకప్ ఉంటుందా.? లేదా.?
By Medi Samrat Published on 20 July 2020 2:37 AM GMTటీ20 ప్రపంచకప్- 2020 భవితవ్యం నేడు తేలనుంది. మహమ్మారి కారణంగా గత మూడు నెలలుగా సందిగ్ధంలో పడిన ఈ మెగా ఈవెంట్‌పై నేడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి స్పష్టమైన నిర్ణయం వస్తుందని తెలుస్తోంది. అయితే.. టీ20 ప్రపంచకప్ వాయిదాపై అధికారిక ప్రకటన వస్తే ఐపీఎల్‌పై తమ కార్యాచరణ ఉంటుందని బీసీసీఐ చెబుతున్న నేఫథ్యంలో నేటి నిర్ణయం కీలకం కానుంది
గడిచిన రెండు నెలల్లో పలు పర్యాయాలు భేటీ అయిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా తమ దేశంలో ఈ మెగా టోర్నీ నిర్వహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఐసీసీ వాయిదా ప్రకటన తప్ప చేయగలిందేమీ లేదు. అయితే.. సోమవారం జరిగే సమావేశం తర్వాత వాయిదా ప్రకటన వెలువడితే మాత్రం ఆ మెగా ఈవెంట్ షెడ్యూల్ సమయాన్ని.. ఐపీఎల్–13కు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ బావిస్తుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ టోర్నీ జరగాలి. వాయిదా నిర్ణయం వెలువడిన నేఫథ్యంలో.. ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికను కూడా సిద్ధం చేసుకుంది. లీగ్‌ను కుదించైనా సరే ఈ ఏడాది ఐపీఎల్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది బోర్డు. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు గంగూలీ కూడా పలుమార్లు చెప్పాడు. లీగ్ జరగని పక్షంలో బోర్డుకు రూ. 4000 కోట్ల నష్టం వస్తుంది. ఆసియా కస్ కూడా రద్దైంది. ఈ నేఫథ్యంలో నేడు టీ20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్‌కు మార్గం సుగమం కానుంది.
ఇక భారత్‌లో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటింది. దీంతో భారత్‌లో లీగ్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. బీసీసీఐ విదేశీ ఆతిథ్యంపై కన్నేసింది. ఈ విషయమై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘తొలి అడుగు ఆసియా కప్ వాయిదాతో పడింది. ఇక టి20 మెగా ఈవెంట్‌పై అధికారిక ప్రకటన వస్తే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలంటే ఐసీసీ ప్రకటన రావాలి’ అని అన్నారు. దీంతో నేడు జరిగే ఐసీసీ సమావేశంపైనే ఐపీఎల్ 2020 జరగనుందా.. లేదా అనేది తేలనుంది.