11వేల ఉద్యోగాలు ఉఫ్‌..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  31 July 2020 11:24 AM IST
11వేల ఉద్యోగాలు ఉఫ్‌..!

దేశంలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు కోత పడుతోంది. కరోనా ప్రభావం.. ఆర్థిక సంక్షోభం.. ఆదాయంలో తగ్గుదల తదితర కారణాల వల్ల కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించేస్తున్నాయి. పెద్దపెద్ద ఐటీ దిగ్గజాల్లాంటి కంపెనీలకూ ఈ తగ్గంపు తప్పడం లేదు. గత మూడు నెలల్లో అయిదు బడా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్లో భారీ కోత విధించాయి. దాదాపు 11వేలమంది ఉద్యోగులు నిష్క్రమిం చినట్లు తెలుస్తోంది. కరోనా విలయమే ఈ పరిణామానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఒకవైపు ఉద్యోగాల్లో భారీ కోతలు విధిస్తూనే.. మరోవైపు కొత్తవారి నియామకాల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ చర్యలు తాత్కాలికమేనని రానున్న రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది.. మళ్ళీ నియామకాలు యథావిధిగా సాగుతాయని అంటున్నా.. ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని కలలో కూడా ఊహించని చాలామంది ఉద్యోగులు వీధిన పడాల్సి వచ్చింది. వారి బడ్జెట్‌ తల్లకిందులవుతోంది. సగటు ఉద్యోగికి పిల్లల చదువులు, కుటుంబ పోషణ, బ్యాంకు ఈఎంఐలు తలకుమించిన భారంగా మారుతున్నాయి.

గత ఏప్రిల్‌–జూన్‌ నెలల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) దాదాపు 4వేల పైచిలుకు తగ్గించారు.. ఇన్ఫోసిస్‌లో మూడేవేల పైగా, విప్రోలో వెయ్యికి పైగా, టెక్‌ మహేంద్రలో పద్దెనిమిది వందల దాకా ఉద్యోగాలు తగ్గాయి. ఈ కంపెనీల్లో మొత్తమ్మీద రమారమి 11వేల మంది ఉద్యోగుల నిష్క్రమించినట్లు తెలుస్తోంది.

ఇన్ఫోసిస్‌ సీవోవో ప్రవీణ్‌ రావు మాట్లాడుతూ కొత్తవాళ్ళ నియామకాలు ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచినట్లు తెలిపారు. అయితే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5వేలమందిని రిక్రూట్‌ చేసుకున్నట్లు వివరించారు. ఈ పరిస్థితి మాకు కూడా కొత్త అనిపించినా రానూ రానూ అలవాటవుతుంది. ఈ కరోనా మరికొంత కాలం ఉంటుంది కాబట్టి ఈ హెచ్చుతగ్గులు తప్పవని తెలిపారు. ఈ ఏడాది ఆఖరుకల్లా దాదాపు 20వేలమంది కొత్తవాళ్ళ నియామకాలు చేబట్టనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

విప్రో సీఎఫ్‌వో జతిన్‌ దలాల్‌ మాట్లాడుతూ తమ కెంపెనీలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు కొదవేం లేదన్నారు. ‘ మేం చాలా సందర్భాల్లో చెబుతూనే వస్తున్నాం. కంపెనీ తన ఆదాయాన్ని వృద్ధి చేసుకోడానికే నియామకాలు చేపడుతుంది. కంపెనీకి అవసరముం దంటే తప్పకుండా రిక్రూట్‌మెంట్‌ కూడా ఉంటుంది. నేరుగా చెప్పాలంటే.. కంపెనీ ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అదీ కాకుండా మా ఉద్యోగుల్లోనే నైపుణ్యాలున్నవారు చాలా మంది ఉన్నారు.‘ అని తెలిపారు. టెక్‌ మహీంద్ర సీఎఫ్‌వో మనోజ్‌ భట్‌ మాట్లాడుతూ గత మూడునెలలుగా కంపెనీ రాబడిలో క్షీణత చోటుచేసుకోవడంతో ఆ ప్రభావం నియామకాలపై పడిందన్నారు.

ఈ కంపెనీల్లో నియామకాలు జోరుగా సాగాలంటే ఐటీ వృద్ధి కూడా అవసరం. అయినా ఈ కోతలకు సంబంధించి చాలా కారణాలున్నాయనే చెప్పవచ్చు. కరోనా విస్పోటం ఉద్యోగాల నియామకాల స్తంభనకు మరో బలమైన కారణంగా నిలుస్తోంది. ఇదే కాకుండా కంపెనీల్లో ఆటోమిషన్‌ పద్ధతి పెరిగిపోవడంతో ఉద్యోగుల అవసరం తగ్గడానికి కారణంగా నిలుస్తోంది.

ఏది ఏమైనా ఐటీ కంపెనీలు ఈ ప్రతిష్టంభనను అధిగమించి మళ్ళీ అధిక సంఖ్యలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని పలువురు ఆశిస్తున్నారు. ఆ రోజుల కోసమే కొత్త నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Next Story