గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గిన డీజిల్‌ ధర.. లీటర్‌పై రూ.8 తగ్గింపు

By సుభాష్  Published on  30 July 2020 10:22 AM GMT
గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గిన డీజిల్‌ ధర.. లీటర్‌పై రూ.8 తగ్గింపు

కరోనా కట్టడికోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా పెరుగుతూ పోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు సృష్టించాయి. వాహనదారులు బైక్‌లను బయటకు తీయాలంటేనే జంకే పరిస్థితి వచ్చేది. ఇక ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో డీజిల్‌ ధరలు పెట్రోల్‌ రేటుకు సమానంగా దూసుకుపోయాయి. ఈ సమయంలోఒక వైపు పెట్రో ఉత్పత్తుల ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తుంటే.. ఢిల్లీ సర్కార్‌ మాత్రం వాహనదారులకు ఊరటనిచ్చే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై వ్యాట్‌ను 30శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన ఢిల్లీ కేబినెట్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో దేశ రాజధానిలో డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ.8.36 తగ్గి రూ.82 నుంచి రూ.73కు దిగివచ్చాయి. డీజిల్‌ దిగిరానుండటంతో ఢిల్లీ ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నెలకొనేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేబినెట్‌ సమావేశానికి అధ్యక్షతన వహించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ సవాల్‌తో కూడుకున్నదని, ప్రజల సహకారంతో దీనిని సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. డీజిల్‌ ధరను తగ్గించాలని కొంత కాలంగా నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించడంతో దేశంలోనే డీజిల్ ధర తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. ఇక రాజస్థాన్‌లో అత్యధికంగా డీజిల్‌ లీటర్‌కు రూ.82 ఉండగా, మధ్యప్రదేశ్‌లో రూ.81.29 ఉంది. ఇక మహారాష్ట్రలో రూ.79.81 రూపాయలు పలుకుతోంది. ఇక గుజరాత్‌లో లీటర్‌ డీజిల్‌ 79 రూపాయలు ఉంది.Next Story
Share it