విద్యావిధానంలో సరికొత్త సంస్కరణలు

By మధుసూదనరావు రామదుర్గం  Published on  30 July 2020 2:54 AM GMT
విద్యావిధానంలో సరికొత్త సంస్కరణలు

ప్రాపంచీకరణ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల్లో కొంగొత్త ఆలోచనలకు ఆకృతి ఇచ్చేలా.. వారిలో ప్రపంచస్థాయి పోటీ పటిమను పెంపొందించేలా,కొత్త తరాలకు అసరమైన అధునాతన సంస్కరణలతో రూపొందిన జాతీయ విద్యావిధానం–2020ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 34 ఏళ్ల కిందట1986లో రూపొందిన జాతీయ విద్యావిధానం స్థానంలో ఈ కొత్త విధానం అమలు కానున్నది. అందరికీ అందుబాటు, నాణ్యత తదితరాంశాలు పునాదులుగా ఈ విధానాన్ని రూపొందిం చారు. 2030 నాటికి భారతదేశం ప్రపంచదేశాల్లో విజ్ఞానవ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో, దేశ సుస్థిరాభివృద్ధే ధ్యేయంగా ఈ కొత్త విధానం మనముందుకు రాబోతున్నది.

ఈ విద్యావిధానంలో కేవలం సంస్కరణలే కాకుండా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు దాకా అందరికీ విద్య తప్పనిసరిగా ప్రకటించింది. 2030 నాటికి అందరికీ విద్య అన్న నినాదంతో ఈ విధానం రూపొందించినట్టు తెలిపింది. అన్ని భారతీయ భాషల్లో బోధన ఉండేలా కీలక మార్పులు సూచించింది.

నూతన విద్యావిధానం ద్వారా 2 కోట్ల మంది పిల్లలను ప్రధాన విద్యా స్రవంతిలో తేవాలని సంకల్పించారు. ఇప్పటిదాకా ఉన్న 10+2 విధానంలో మార్పు చేసి 5+3+3+4 గా మార్చారు. పాఠశాల విద్యలో 3 ఏళ్లు అంగన్‌ వాడీ లేదా ప్రి స్కూలింగ్‌ 12 ఏళ్ళు స్కూలింగ్‌ ఉండేలా నిర్ణయించారు. విద్యా విధానం బలంగా ఉండేందుకు అవసరమైన అంశాలపై దృష్టి పెట్టారు. అకడెమిక్‌ విద్య, అదనపు కరికులమ్, వృత్తివిద్యల మధ్య ఉన్న విభజనను సరళంగా సుదృఢంగా రూపొందించారు.

ఆరో తరగతి నుంచే ఇంటర్న్‌షిప్‌గా వృత్తివిద్య మొదలవు తుంది. అంతేకాదు కోడింగ్‌ ప్రోగ్రామింగ్‌ లాంటి కొత్త సాంకేతిక అంశాలను విద్యార్థులు నేర్చుకుంటారు. గ్రేడ్‌ 5 దాకా మాతృభాషలోనే విద్యబోధన ఉండాలని నిర్ణయించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్‌ అర్థం చేసుకునే లా బోధించే విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతిని సమీక్షింవే విధానాంలోనూ మార్పులుండ బోతున్నాయి. సమీకృత సమీక్ష ఉండేలా 360 డిగ్రీ ప్రగతి పత్రం రూపొందిస్తారు. ఈ పత్రంలో విద్యార్థి అభ్యసించింది.. నేర్చుకున్నది ఎంత మేరకన్న అంశాలుంటాయి.

2035 నాటికి జీఈఆర్‌ 50 శాతం వృద్ధి చెందేలా ఉన్నత విద్యకు 3.5 కోట్ల సీట్లు పెంచుతున్నారు. ఉన్నత విద్య కరికులమ్‌ సరళంగా సుబోధంకా ఉండేలా సబ్జెక్టులు ఉంటాయి. పరిశోధనా రంగం మరింత పుంజుకునేలా జాతీయ పరిశోధనను మరింత పటిష్టం చేయనున్నారు. రానున్న 15 ఏళ్లల్లో అనుబంధ విధానం స్థానే కళాశాలలకు గ్రేడెడ్‌ అటానమీ కల్పించనున్నారు.

జాతీయ విద్యావిధానం–2020 విద్యార్థులందరూ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకునేలా రూపొందించారు. ప్రాథమిక, ఉన్నత విద్యలో బహుభాష లో బోధన, అభ్యాసం ఉంటుంది. పాళీ,పర్షియన్, ప్రాకృతి భాషల అభ్యాసానికి నేషనల్‌ ఇనిస్టిట్యూషన్, అనువాద విద్య కోసం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు కానుంది.

Next Story
Share it