బిగ్‌బాష్‌లో ఆడ‌నున్న యువీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sept 2020 5:09 PM IST
బిగ్‌బాష్‌లో ఆడ‌నున్న యువీ..!

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లీగ్‌ బిగ్‌బాష్‌‌లో ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా అతడి కోసం ఓ జట్టును వెతికే పనిలో ఉంద‌ని సమాచారం. టీమిండియాకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న యాక్టివ్ ప్లేయర్లు విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. ఫలితంగా ఒక్క భారత క్రికెటర్ కూడా బిగ్‌బాష్‌లో అడుగుపెట్టలేకపోయాడు. దీంతో బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్ ఆడలేదు.

ఆస్ట్రేలియా ప‌త్రిక‌.. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం.. ఆల్‌రౌండర్ అయిన యువరాజ్ కోసం ఆసక్తి ఉన్న ఫ్రాంచైజీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా వెతుకులాట ప్రారంభించింది. స్పోర్ట్స్ అండ్ మీడియాకు చెందిన యువరాజ్ మేనేజర్ జాసన్ వార్న్ దీనిని ధ్రువీకరించారు. యువ‌రాజ్ బీబిఎల్లో ప్రాతినిథ్యం వ‌హించ‌డంపై ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఐపీఎల్ సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు ఆడితే అది బీబీఎల్‌కే గొప్ప విషయమన్నాడు.

ఇదిలావుంటే.. యువరాజ్ తన కెరీర్‌లో 304 వన్డేలు ఆడి 8,701 పరుగులు చేయ‌డంతో పాటు.. బౌలర్‌గా 111 వికెట్లు తీసుకున్నాడు. అలాగే టీమిండియా త‌రుపున‌ 40 టెస్టులు, 58 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రొఫేష‌న‌ల్ క్రికెట్ కు గతేడాది వీడ్కోలు పలికిన 38 ఏళ్ల యువరాజ్ సింగ్‌‌.. ఇప్పుడు విదేశీ లీగుల్లో ఆడే అవకాశాల‌ను అంది పుచ్చుకుంటున్నాడు.

Next Story