ఐపీఎల్ 2020 : షార్జా క్రికెట్ స్టేడియం గురించి తెలుసుకోండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 7:26 AM GMT
ఐపీఎల్ 2020 : షార్జా క్రికెట్ స్టేడియం గురించి తెలుసుకోండి..!

ఐపీఎల్ 2020 షెడ్యూల్ ను బీసీసీఐ సెప్టెంబర్ 6న విడుదల చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు మూడు సార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ తో అబుదాబీలోని షేక్ జాయేద్ స్టేడియంలో తలపడనుంది. ఆ తర్వాతి రెండు మ్యాచ్ లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్ లు ముగిసిన వెంటనే 'షార్జా క్రికెట్ స్టేడియం' లో కూడా ఐపీఎల్ యాక్షన్ మొదలుకానుంది. సెప్టెంబర్ 22న షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఐపీఎల్ 2020లో భాగంగా 11 లీగ్ మ్యాచ్ లు షార్జాలో జరగనున్నాయి.

ఈ స్టేడియంలో మధ్యాహ్నం సమయంలో ఓ మ్యాచ్ జరగనుండగా.. ఆఖరి లీగ్ గేమ్ షార్జాలోనే జరగనుంది.

షార్జా క్రికెట్ స్టేడియంలో ఇప్పటి దాకా 14 టీ20 మ్యాచ్ లు నిర్వహించడం జరిగింది. సగటు స్కోరింగ్ రేటు ఈ గ్రౌండ్ లో 7.20 మాత్రమే..! ఈ గ్రౌండ్ లో అత్యధికంగా ఛేజింగ్ చేసిన స్కోర్ 140/3.. స్కాట్లాండ్ మీద ఆఫ్ఘనిస్థాన్ ఈ విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన మొహమ్మద్ షెజాద్ నాలుగేళ్ల కిందట ఈ గ్రౌండ్ లో జింబాబ్వే మీద సెంచరీ కొట్టాడు. షార్జాలో జరిగిన 14 టీ20 మ్యాచ్ లలో 12 మ్యాచ్ లు ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీ ఆడాడు. 249 పరుగులు చేయడమే కాకుండా.. 10 వికెట్లను కూడా తీశాడు నబీ. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు నబీ ఆడుతున్నాడు.

ఐపీఎల్ 2014లో షార్జా క్రికెట్ గ్రౌండ్ లో ఆరు మ్యాచ్ లు నిర్వహించారు. కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ 100 శాతం విజయాలు ఈ గ్రౌండ్ లో సాధించాయి. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఒక్క విజయాన్ని కూడా సాధించలేదు.

ఈ గ్రౌండ్ కు రెండు ఎండ్స్ ఉన్నాయి.. పెవిలియన్ ఎండ్, షార్జా క్లబ్ ఎండ్..! 17000 మంది గ్రౌండ్ లో కూర్చుని మ్యాచ్ ను వీక్షించవచ్చు. షేక్ జాయేద్ స్టేడియం లాగే షార్జా క్రికెట్ గ్రౌండ్ స్పిన్ బౌలర్లకు అనుకూలించనుంది. 150-160 పరుగులు చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయాలు సాధించాయి.

Next Story