నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం.. అక్క చెల్లెమ్మలకు రూ.1400 కోట్లు
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 10:50 AM ISTఅమరావతి : ఏపీలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావటానికి ప్రవేశపెట్టిన 'వెఎస్సార్ సున్నా వడ్డీ' పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం ఒక బటన్ నొక్కగానే సెర్ఫ్,మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఒకే విడతలోసొమ్ము జమకానుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 90,37,254 మంది మహిళలకు వారివారి ఖాతాల్లో రూ. 1,400 కోట్లు ఒకే విడతలో జమకానున్నాయి. ఏ పొదుపు సంఘానికి వడ్డీ డబ్బులు ఎంత జమచేసిందనే వివరాలను కూడా తెలియజేయనున్నారు. డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ఫ్, మెప్మా అధికారుల ఫోన్ నంబర్లను సభ్యులకు అందజేయనున్నారు. కాగా, ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే.
పొదుపు సంఘాల మహిళలు పడుతున్న కష్టాలను తన పాదయాత్రలో కళ్లారా చూసిన జగన్ వారికి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి, మిగిలిన ఏడు జిల్లాల్లో 11 శాతం నుండి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద మహిళల మీద పడకూడదన్న ఆలోచనతో ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తామని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 1,400 కోట్ల వడ్డీ భారం పడనుంది.