వైఎస్ అంటే అవే గుర్తుకొస్తాయి..
By Medi Samrat Published on 8 July 2020 6:15 PM ISTఏపీ ప్రభుత్వం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వైఎస్సార్ జయంతి పురస్కరించుకుని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సి బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ముందుగా రూ. 96.50 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం.. నేడు రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మిగిలిన బకాయిల మొత్తం రూ. 1054 కోట్ల రూపాయలను సీఎం జగన్ విడుదల చేశారు. అలాగే.. రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 54.6 కోట్ల రూపాయల పాత బకాయిలను కూడా సీఎం జగన్ విడుదల చేశారు.
దీంతో పాటు.. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ రైతులు, ఇతర అధికారులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ది పనులను, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు.
రైతులకు మంచి చేసిన నాయకుడు వైఎస్సార్. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైల్‌పై వైఎస్‌ఆర్ తొలి సంతకం చేశారని.. రైతుల కరెంట్ బకాయిలను కూడా రద్దు చేసిన ఘనత వైఎస్సార్‌దని కొనియాడారు. మనం ఇప్పుడు ప్రతి రైతుకు రూ. 50వేలకుపైగా లబ్ధి పొందేలా మేలు చేస్తున్నామని.. వైఎస్ అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్‌లు గుర్తుకొస్తాయని.. ఇప్పుడు వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు.
రైతుల కోసం 1907 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని.. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. ఉద్యానవన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని.. పొగాకు రైతులకు కూడా అండగా ఉంటున్నాం. పొగాకును కూడా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జగన్ అన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఇప్పటికే 83శాతం ఫీడర్లను మెరుగుపరిచామని.. రూ.1700 కోట్ల రూపాయలు కరెంటు సదుపాయాలను మెరుగుపరచడానికి ఇచ్చామని అన్నారు.
దేశ చరిత్రలో తొలిసారిగా పంటల భీమా సొమ్మును రైతుల తరఫున కడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని అన్నారు. ఆక్వా రైతులకు సరఫరా చేసేలా రూ.700 కోట్ల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం మోస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే.. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ట్యాక్స్ కూడా రద్దు చేశామని తెలిపారు. ఇక జలయజ్ఞం పనులు వేగంగా సాగుతున్నాయని.. ఈ ఏడాదే ఆరు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానున్నామని జగన్ తెలిపారు.