వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ప్రారంభం..

By అంజి  Published on  21 Dec 2019 10:10 AM GMT
వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ప్రారంభం..

ముఖ్యాంశాలు

  • 85 వేల మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం
  • ఆప్కో వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తా: సీఎం జగన్‌
  • 25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇస్తాం: సీఎం

అనంతపురం: ధర్మవరంలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథాకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ప్రభుత్వం రూ.24 వేల ఆర్థికసాయం అందజేయనుంది. నేతన్న నేస్తం పథకంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడారు. ధర్మవరంలో నేతన్నల ఇబ్బందులు తెలుసని, తన పాదయాత్ర సమయంలో నేతన్నల కష్టాలను చూశానన్నారు. ఆప్కో వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం తెచ్చామన్నారు. 85 వేల మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం జేయనుంది. నేరుగా బ్యాంక్‌ అకౌంట్లోనే నగదు జమ చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఐదేళ్లలో ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు ఇస్తామన్నారు. బీసీలంటే వెనకబడిన కులాలు కాదని.. బీసీలంటే బ్యాక్‌బోన్‌ కులాలుగా మారుస్తామని వ్యాఖ్యనించారు. 25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. జనవరి 9న అమ్మ ఒడి పథకం ప్రారంభిస్తామని తెలిపారు. ఆరు నెలల్లో అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసా కల్పించామని, పేదవాడికి అండగా నిలిచేలా పథకాలు రూపొందించామన్నారు. కేబినెట్‌లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చామన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో రిజర్వేషన్లు పాటించామని, శాసనసభలో చట్టం కూడా చేశామని సీఎం జగన్‌ తెలిపారు. అందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. పథకాల అమలులో వివక్ష, కరప్షన్‌ లేకుండా చేశామని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు.. దేవుడి దయే తన బలం అని సీఎం జగన్‌ అన్నారు.

Next Story