వికేంద్రీకరణకే మొగ్గు చూపిన జీఎన్ రావు కమిటి

By రాణి  Published on  20 Dec 2019 1:01 PM GMT
వికేంద్రీకరణకే మొగ్గు చూపిన జీఎన్ రావు కమిటి

ముఖ్యాంశాలు

  • జగన్ నిర్ణయానికే ఓటేసిన కమిటి
  • కర్నూల్ లో హై కోర్టు
  • అమరావతి, వైజాగ్ లలో హైకోర్టు బెంచ్ లు
  • వైజాగ్ లో ఎండాకాల సమావేశాలు
  • కర్నూల్ లో శీతాకాల సమావేశాలు
  • అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్, మంత్రుల కార్యాలయాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ 500 పేజీలతో కూడిన తుది నివేదికను అందజేసింది. జగన్ కు నివేదిక అందజేసిన అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో సమావేశమై కమిటీ అధ్యయనం ఎలా సాగిందో వివరించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే కమిటీ నివేదిక ఇచ్చామని ఎక్స్ పర్ట్స్ కమిటీ సభ్యులు చెప్పారు. మొత్తం 10600 కిలోమీటర్లు తిరిగి నివేదిక అందజేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి బాగా జరిగితే...మరికొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని కమిటీ పేర్కొంది.

జీఎన్ రావు మాట్లాడుతూ...రాష్ర్ట అభివృద్ధిలో అన్ని ప్రాంతాలూ భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతోనే అధ్యయనం చేశామని, అన్ని ప్రాంతాలనూ సమగ్రంగా పరిశోధించామని వెల్లడించారు. అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరించామని, ఆన్ లైన్ లో వచ్చిన అభిప్రాయాలను కూడా పరిశీలించామన్నారు. రాయపూడి, తుళ్లూరు ప్రాంత ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేశామని, కమిటీ అధ్యయనం ప్రకారం సీమ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని కమిటీ సభ్యురాలు అంజలీ మోహన్ తెలిపారు.

సీఎం జగన్ కు అందజేసిన నివేదికలో 13 జిల్లాల్లో చేయాల్సిన అభివృద్ధికి సూచనలు చేశామన్నారు. కర్ణాటక తరహాలో మొత్తం నాలుగు రీజియన్ బోర్డుల్లో అభివృద్ధి జరగాల్సి ఉందని కమిటీ వివరించింది. ఈ మేరకు నాలుగు పాలక మండళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. నార్త్ కోస్టల్ రీజియన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, వెస్ట్ కోస్టల్ రీజియన్ తూ.గో, ప.గో, కృష్ణా జిల్లాలు, సౌత్ కోస్టల్ రీజియన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ రీజయన్ లో కర్నూల్, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అభివృద్ధి జరగాల్సి ఉందని కమిటీ తెలిపింది. అయితే వదర ముంపు ప్రాంతాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పినట్లు కమిటీ వెల్లడించింది.

తుళ్లూరులోనే అసెంబ్లీని ఉంచాలి కానీ, విశాఖలో ఎండాకాల సమావేశాలు జరగాలని ప్రతిపాదించింది కమిటీ. శ్రీభాగ్ ఒప్పందం మేరకే కర్నూల్ లో హై కోర్టు(జ్యుడిషియల్ రాజధాని) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా.. ఒక బెంచ్ ను అమరావతిలో, మరో బెంచ్ ను వైజాగ్ లో ఏర్పాటు చేయాలని సూచించినట్లు కమిటీ చెప్పుకొచ్చింది. అలాగే కర్నూల్ లో సీఎం క్యాంప్ కార్యాలయం, హై కోర్టు, వింటర్ అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది. అలాగే అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్, మంత్రుల కార్యాలయాలు ఉండాలని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరినట్లు కమిటీ తెలిపింది. మొత్తానికి జీఎన్ రావు కమిటీ రాష్ర్టానికి మూడు రాజధానులు అవసరమన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికే మొగ్గు చూపింది.

Next Story