వివేకా హత్య కేసు.. మాజీ మంత్రికి మూడో సారి నోటీసులు..!

By అంజి  Published on  10 Dec 2019 11:16 AM GMT
వివేకా హత్య కేసు.. మాజీ మంత్రికి మూడో సారి నోటీసులు..!

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి సిట్‌ బృందం మరో సారి నోటీసు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినా తీసుకోకుండా ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులు నోటీసులను వెనక్కి పంపారు. గత కొంత కాలంగా ఆదినారాయణరెడ్డి ఢిల్లీలోనే ఉంటున్నారు.

కాగా తాజా నోటీసులకు ఆదినారాయణరెడ్డి స్పందించకపోతే కోర్టును ఆశ్రయించాలని సిట్‌ బృందం ఆలోచిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. మరీ తాజా నోటీసుకైనా మాజీ మంత్రి ఆది స్పందిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు సిట్‌ బృందానికి విచారణకు రాకుండా ఉండేందుకు ఆదినారాయణరెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. టీడీపీ హయాంలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఈ సంవత్సరం మార్చి 15న వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌కు వివేకానందరెడ్డి సొంత బాబాయి. వివేకా హత్య ఘటన సమయంలో ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నాయి. కాగా వివేకా హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు సీఎం జగన్‌ ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు.

Next Story