నాలుగింటికి నాలుగూ.. అధికార వైసీపీ ఖాతాలోకే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2020 1:37 PM GMT
నాలుగింటికి నాలుగూ.. అధికార వైసీపీ ఖాతాలోకే..

అమరావతి : ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం జరిగింది. రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండగా.. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.

వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ‘రాంకీ’ అయోధ్యరామిరెడ్డి, రిలయన్స్ ‌ గ్రూపునకు చెందిన పరిమళ్‌ నత్వానీ పోటీ చేశారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు. పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభయింది. సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కించారు.

అయితే.. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అవన్నీ టీడీపీ సభ్యులవే కావడం గమనార్హం. దీంతో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రులు

సీఏఏకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని పేర్కొన్నారు. వారికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని.. గతంలో పేర్కొన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

Next Story