విశాఖకు నిరంతరాయంగా తాగునీరు.. అందుకేనా..!
By అంజి
అమరావతి: పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల కింద అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. విశాఖపట్నం సహా కాకినాడ, తిరుపతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత వాటి పరిస్థితులపై సమీక్ష చేశారు. విశాఖకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం నుంచి నేరుగా భూగర్భ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా చేపట్టాలని సీఎం అన్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
విశాఖ మెట్రో రైల్‌పై సమీక్ష
విశాఖలో బీచ్ వెంబడి ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు ట్రామ్ తరహా ప్రజారవాణా వ్యవస్థపై ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. డీపీఆర్ తయారీకి త్వరలో కన్సల్టెన్సీ నియామకం చేపట్టాలన్నారు. విశాఖపట్నంలో సుమారు లక్షా యాభైవేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పట్ణణ గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 48,608 హౌసింగ్ యూనిట్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని సీఎంకు అధికారులు వివరించారు. వీటి కాంట్రాక్టు విలువ రూ.2,399 కోట్లు అయితే రివర్స్ టెండర్ ద్వారా రూ.303 కోట్లు మిగిలాయని అధికారులు తెలిపారు స్పెసిఫికేషన్స్ మార్చకుండా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం అన్నారు. పట్టణ గృహనిర్మాణంలో డ్రైనేజీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించాడు. స్కూళ్లలో తల్లిదండ్రుల కిమటీల్లానే ప్లాట్ల నిర్వహణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు.
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీల్లో 19,769 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వేయడానికి రూ. 23,037 కోట్లు ఖర్చు అవుతుందంటూ అధికారులు అంచనాలు వివరించారు. లక్షకుపైబడ్డ జనాభా ఉన్న 34 మున్సిపాలిటీల్లో భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కోసం రూ.11,181 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కాగా మురుగునీటిని తప్పనిసరిగా శుద్ధిచేసిన తర్వాత మాత్రమే బయటకు వదలాలని సీఎం అన్నారు. దశలవారీగా, జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత గల పనులు చేపట్టాలన్నారు. డీశాలినేషన్ చేసిన నీటినే పరిశ్రమలు వాడేలాగా చూడాలని సీఎం జగన్ అన్నారు. అలాగే శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలు వాడుకునేలా చూడాలన్నారు. మంచినీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడాలన్నారు. ఆ మేరకు అధికారులు సన్నద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు.
తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సీఎం జగన్ అన్నారు. ఈ మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలతో రావాలని సీఎం జగన్ సూచించారు. దీంతో డీపీఆర్ తయారీ చేయిస్తున్నామని అధికారులు వివరించారు. తాడేపల్లి, మంగళగిరిల్లో 10,794 మంది ఇళ్ల పట్టాల లబ్దిదారులను గుర్తించామని అధికారులు తెలిపారు.
మోడల్ కాలనీ నిర్మించాలన్న సీఎం..
ముంపునకు గురికాకుండా విజయవాడలో రిటైనింగ్ వాల్ పూర్తిచేయాలని సీఎం అన్నారు. లంచాలు లేకుండా బిల్డింగ్ ప్లాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలని సీఎం జగన్ సృష్టం చేశారు. మెరుగైన వ్యవస్థను తయారుచేయడానికి అహ్మదాబాద్ ఐఐఎంని వినియోగించుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి చోటు లేకుండా బిల్డింగ్ ప్లాన్స్ ప్రజలకు అందాలని సీఎం జగన్ అన్నారు. అవినీతిలేని వ్యవస్థను తీసుకువస్తే అధికారులను సన్మానిస్తామని సీఎం జగన్ అన్నారు. కమలాపురం, కుప్పంలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు.