బినామీల భూముల కోసమే చంద్రబాబు ఆరాటం
By అంజి
అమరావతిలో తన బినామీల భూములకు నష్టం జరుగుతుందనే ఆందోళనతోనే చంద్రబాబు పోరాటం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారంను కాపాడుకునేందుకు ప్రాకులాడుతున్నాడని విమర్శించారు. అభివృద్థి వికేంద్రీకరణను అడ్డుకుంటున్న చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, దానిని రెఫరెండంగా తీసుకోవాలని సవాల్ చేశారు. ఎక్కడ తన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను సిబిఐ విచారణకు అప్పగిస్తారనే భయంతోనే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడు రైతుల పక్షాన నిలబడలేదని అన్నారు. కానీ ఈ రోజు రైతుల కోసం అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని అన్నారు. చంద్రబాబు రైతుల సమస్యల గురించి కాకుండా తన బినామీల ప్రయోజనాల గురించి ఆందోళన చెందుతున్నాడని అన్నారు. దీనిని రైతు సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ జీవితం వరకు ప్రతి ఒక్కటి అసత్యాలతో నిండిపోయిందని, ఈ రోజు అమరావతి కోసం ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పడం విడ్డూరంగా వుందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాయకుడు అనే వారికి అన్ని ప్రాంతాలు అభివృద్థి చెందాలనే చిత్తశుద్ది వుండాలని, అందరికీ మంచి జరగాలనే ఆలోచనతో వుండాలని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పట్టణాలు, నగరాల్లో వ్యాపారులు రంగురంగుల గ్రాఫిక్స్ తో బ్రోచర్లు వేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని, అలాగే చంద్రబాబు కూడా అమరావతి పేరుతో రంగుల గ్రాఫిక్స్ చూపి ఈ ప్రాంత రైతాంగాన్ని మోసం చేశాడని ఆరోపించారు. రైతులను తన మోసపూరితమైన ప్రచారంతో మాయ చేశాడని, తన కుట్రలతో రైతుల గొంతు కోశాడని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు సమాధానం చెప్పాలి..
రైతును ప్రేమించే నాయకుడు వైఎస్ఆర్ అయితే ఆయన వారసుడు వైఎస్ జగన్‌కు రైతులంటే ఎంతో ప్రేమ వుందని అన్నారు. అందుకు భిన్నంగా చంద్రబాబు రైతులకు భ్రమలు సృష్టించి, అయిదేళ్ల పాటు అధికారంలో వుండి కూడా వారికి ఏ రకమైన మేలు చేయలేకపోయాడని అన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబును కరకట్ట వద్ద ఆయన నివాసం వద్దకు వెళ్ళి రైతులు తమకు జరిగిన మోసంపై నిలదీయాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మోసపోయిన రైతాంగానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిలో గజం ముప్పై ఆరు వేలు అవుతుందని, ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుందనే భ్రమలు కల్పించారని విమర్శించారు.
ఇప్పుడు తన బినామీలు నష్టపోతున్నారని రాష్ట్రంలో అశాంతిని, ప్రాంతీయ విద్వేశాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి పరిరక్షణ పేరుతో జోలె పట్టుకుని చందాలు వసూలు చేస్తున్నారని, గతంలో ఇటుకలు అమ్మిన కోట్లాది రూపాయలు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, కులాల మద్య అసమాతనలు సృష్టించడం చేస్తున్నారని, ఈ ఆటలు సాగనివ్వమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణకు ఒప్పుకునేది లేదని అన్న మాటలను చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. ఇష్టం వచ్చినట్లు తన బినామీలతో రాజధానిలో చేసిన అవినీతిని చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చిన చంద్రబాబు ఈ రోజు నీతులు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.