సెంచ‌రీల‌తో రెచ్చిపోయిన కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

By Medi Samrat  Published on  15 Nov 2023 6:16 PM IST
సెంచ‌రీల‌తో రెచ్చిపోయిన కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 ప‌రుగుల‌ భారీ స్కోరు చేసింది. భారత్ తరఫున విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు సెంచ‌రీలు చేయ‌డంతో న్యూజిలాండ్‌కు 398 ప‌రుగుల‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్‌ 117 పరుగులతో శ‌త‌కాన్ని బాది వన్డేల్లో 50 సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నాడు.

దీంతో పాటు ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుత సెంచరీ సాధించాడు. అయ్యర్ 105 పరుగుల ఉప‌యుక్త‌క‌ర‌మైన‌ ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చాలా వేగంగా ప్రారంభించారు. అయితే రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. రోహిత్ బ్యాట్ నుంచి 47 పరుగులు మాత్ర‌మే వచ్చాయి. అదే సమయంలో శుభ్‌మన్ గిల్‌కు కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో 79 పరుగుల స్కోరు వద్ద మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి రన్ రేట్ తగ్గకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. చివర్లో కేఎల్ రాహుల్ కూడా వేగంగా ఆడాడు. రాహుల్ 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరఫున టిమ్‌ సౌతీ 3 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీసుకున్నాడు. మరే ఇతర కివీస్ బౌలర్ వికెట్ తీయలేకపోయాడు.

Next Story