కనీసం షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ ఈ

By Medi Samrat  Published on  7 Nov 2023 11:30 AM IST
కనీసం షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ ఈ టోర్నమెంట్‌లో అత్యంత వివాదాస్పదమైన మ్యాచ్ లో ఒకటిగా నిలిచింది. అంతే కాదు మొత్తం ప్రపంచ కప్‌ చరిత్రలో ఓ అరుదైన ఘటన జరిగిన మ్యాచ్ గా నిలిచింది. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్, బంగ్లాదేశ్ పేసర్ తంజిమ్ హసన్ సాకిబ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైం అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో గడువు ముగిసిన తర్వాత అవుట్ అయిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు.

25వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. తన హెల్మెట్ సరిగా లేకపోవడంతో మరో హెల్మెట్ కోసం వేచి చూశాడు. దీంతో నిర్ణీత సమయం మించిపోవడం, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం, వారు మాథ్యూస్‌ను టైమ్‌డ్ అవుట్‌గా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. మాథ్యూస్ తాను ఎందుకోసం వేచి చూసిందీ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మాథ్యూస్‌ను అవుటిచ్చిన తీరు క్రికెట్ స్పిరిట్‌కు ఎంతమాత్రమూ మంచిది కాదని.. మ్యాథ్యూస్ క్రీజులోనే ఉన్నాడని, అతడి హెల్మెట్ పట్టీ విరిగిపోవడంతో టైమ్‌డ్ అవుట్ ఎలా ఇస్తారని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు.

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించినా ఆ జట్టు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడిన తీరును క్రికెట్ అభిమానులు తప్పుబట్టారు. 42వ ఓవర్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించగా.. శ్రీలంక ఆటగాళ్లు అంపైర్‌లకు కరచాలనం చేసి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు తంజిమ్ హసన్ సాకిబ్, తౌహిద్ హృదయ్‌లతో కరచాలనం చేయడానికి శ్రీలంక ఆటగాళ్లు నిరాకరించారు. ప్రతి క్రికెట్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు వరుసలో నిలబడి కరచాలనం చేయడం ఆనవాయితీ. శ్రీలంక ఆటగాళ్లు కరచాలనం చేయకుండానే మైదానం నుంచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ శిబిరం వైపు కూడా శ్రీలంక ఆటగాళ్లు చూడలేదు.

మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని శ్రీలంక తీసుకున్న నిర్ణయం గురించి మాథ్యూస్‌ను అడిగినప్పుడు, బంగ్లాదేశ్ ఆటగాళ్ళు తమ జట్టు ఆటగాళ్లను లేదా ఆటను గౌరవించలేదని.. అందువల్ల తాము స్నేహపూర్వకంగా వారితో ఉండలేకపోయామని శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్‌ చెప్పాడు. అంపైర్‌లతో సహా మనమందరం ఈ అందమైన ఆటకు అంబాసిడర్లం.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు క్రికెట్ ను గౌరవించకపోవడంతో తాము కూడా వారితో కరచాలనం చేయలేదని తెలిపాడు మాథ్యూస్. బంగ్లాదేశ్ చేతిలో ఓడి శ్రీలంక ప్రపంచకప్ సెమీఫైనల్ పోటీ నుండి నిష్క్రమించింది.

Next Story