క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ కప్ చ‌రిత్ర‌లో తొలి ఆట‌గాడు..!

భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో 50కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించాడు.

By Medi Samrat  Published on  15 Nov 2023 7:30 PM IST
క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ కప్ చ‌రిత్ర‌లో తొలి ఆట‌గాడు..!

భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో 50కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించాడు. తద్వారా ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో 49 సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ అధిగమించాడు. 'హిట్‌మ్యాన్' రోహిత్ ఓవరాల్ రికార్డును బద్దలు కొట్టడమే కాదు. ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ ఎడిష‌న్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

2015 ప్రపంచకప్‌లో గేల్ అత్య‌ధికంగా 26 సిక్స్‌లు కొట్టగా.. ఈ ఏడాది 28 సిక్స్‌ల‌తో రోహిత్‌.. క్రిస్ గేల్ రికార్డ్‌ను అధిగమించాడు. ఇన్నింగ్సు ఐదో ఓవర్‌లో రోహిత్.. గేల్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ డెలివరీని డీప్ బ్యాక్‌వాడ్ స్క్వేర్ లెగ్‌పై ఆడి సిక్స‌ర్‌గా మ‌లిచాడు. రోహిత్ సిక్స‌ర్ కొట్టిన వెంట‌నే ప్రేక్షకులు సంబరాల్లో మునిగిపోయారు. సంబ‌రాలు ఓ విధంగా త‌గ్గేలా కనిపించేలా లేదు. దీంతో రోహిత్ తన ధాటిని కొనసాగిస్తూ త‌ర్వాతి ఓవ‌ర్లో మరో సిక్స‌ర్ బాదాడు. ఈసారి మిచెల్ సాంట్నేర్ ఓవ‌ర్‌లో స్క్వేర్ లెగ్ మీదుగా ఆ సిక్స్ బాదాడు.

రోహిత్ చివరికి 29 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు బౌండరీల సహాయంతో 47 పరుగుల వ‌ద్ద ఉండ‌గా ఔట‌య్యాడు. రోహిత్‌ ప్రపంచకప్‌లో ఓవ‌రాల్‌గా 51 సిక్సర్లు కొట్ట‌గా.. ఈ ఎడిషన్‌లో 28 సిక్సర్లు బాదాడు.

ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అసాధారణ ప్రదర్శన టోర్నమెంట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా అతని హోదాను నిల‌బెట్టింది. నిలకడగా సులభంగా సిక్సర్లు కొట్టగలిగే రోహిత్‌ సామర్థ్యం.. అభిమానుల నుండి, తోటి క్రికెటర్ల నుండి ప్రశంసలతో గౌరవాన్ని పొందింది.

Next Story