ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ నాలుగో విజ‌యం.. సెమీస్ చేరేనా..?

2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది.

By Medi Samrat  Published on  3 Nov 2023 3:45 PM GMT
ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ నాలుగో విజ‌యం.. సెమీస్ చేరేనా..?

2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. ఈ రోజు గెలిచి టోర్నీలో ఏకంగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం నెదర్లాండ్స్‌పై 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

చారిత్రాత్మకమైనది ఎందుకంటే ఈ ప్రపంచకప్‌కు ముందు.. ఈ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది. అయితే ఈసారి రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. ఆఫ్ఘనిస్థాన్ జట్టు నాలుగు విజయాలను నమోదు చేసుకుంది. ఈ జట్టు ఇప్పుడు నవంబర్ 7, 10 తేదీల్లో వరుసగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో రెండు పెద్ద మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు అడ్డంకులను ఈ జట్టు అధిగమిస్తే సెమీఫైనల్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచే అవ‌కాశం ఉంది.

ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను సమం చేసింది. పాయింట్ల పరంగా అఫ్గాన్ జట్టు పాకిస్థాన్ కంటే ముందుంది. ఆఫ్ఘనిస్తాన్ 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ ఓటమి తర్వాత నెదర్లాండ్స్ 7 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయింది. ఈ జట్టు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై గెలిచింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన‌ నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గానిస్థాన్‌ తరఫున మహ్మద్‌ నబీ 3 వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్ రెండు వికెట్లు, ముజీబ్ ఉర్ రెహమాన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లు రనౌట్ అయ్యారు.

అనంతరం అఫ్గానిస్థాన్‌ జట్టు 31.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిసి విజ‌య‌డంకా మోగించింది. రహ్మత్ షా మరోసారి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత చివర్లో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అజేయంగా 56 పరుగులు చేసి జట్టును సులువుగా గెలిపించాడు.

Next Story