Fact Check : మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళతో మద్యం అమ్మిస్తోందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Jun 2020 6:05 AM GMTమధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఈ మధ్య ఓ ఫోటో పోస్ట్ చేశారు. మద్యం షాపులో ఓ మహిళ కూర్చున్న ఫోటో అది..! ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళలను కించపరిచిందని.. మహిళలను మద్యం షాపుల్లో పెట్టి మద్యాన్ని అమ్మిస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
'ఈ ఫోటోను చూస్తే సిగ్గేస్తోంది. శివరాజ్ సింగ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు ఏమైనా చేస్తుంది. మహిళలను కించపరిచే విధంగా వారిని మద్యం షాపుల్లో పెట్టి.. వారి చేత మద్యాన్ని అమ్మిస్తోంది. అక్కచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు ఇలాంటి పరిస్థితి దాపురించడం బాధేస్తోంది. శివరాజ్ జీ, మహిళలను పూజించడం మన సంస్కృతి.. వారితో మద్యం అమ్మించడం కాదు' అంటూ ఆ ట్వీట్ లో రాసుకుని వచ్చారు.
ఆ ఫోటోకు దాదాపు 6000 లైక్ లు వచ్చాయి. పలువురు ఆ ఫోటోను రీట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా ఆ పోస్టును రీట్వీట్ చేసారు. 'శివరాజ్ గారూ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యానికి వ్యతిరేకంగా పోరాడారు.. విమర్శలు గుప్పించారు.. ధర్నాలకు దిగారు. మద్యం ద్వారా అక్కచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు ఎంతో ప్రమాదం పొంచి ఉంది అని అన్నారు. ఇప్పుడు అదే అక్కాచెల్లెళ్లను, ఆడబిడ్డలను మద్యం షాపుల్లో కూర్చోబెడుతున్నారు. ఇంతకన్నా సిగ్గు చేటు మరేమీ ఉండదు' అని కమల్ నాథ్ అన్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇదే ఫోటోను Hindustan Times సంస్థ తమ న్యూస్ ఆర్టికల్ కోసం ఉపయోగించింది. ఆ వార్తా కథనం ప్రకారం ఆ మహిళ మద్యాన్ని అమ్మడం లేదు.. ఆమె ఎక్సైజ్ అధికారిణి.. ఆమె మద్యం అమ్మకాలను పరిశీలిస్తున్నారు.
బీజేపీ నేత డాక్టర్ హితేష్ బాజ్ పాయ్ మాట్లాడుతూ 'కాంగ్రెస్ నేతలకు మద్యం అమ్మడానికి.. ఒక ఎక్సైజ్ అధికారిణి మద్యం అమ్మకాలపై సూపర్ వైజ్ చేయడానికి తేడా తెలియదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా రాజకీయం చేస్తోందని.. ఆమె విధులు నిర్వర్తించడం కూడా తప్పేనా..?' అంటూ ప్రశ్నించారు.
Times of India కూడా ఈ ఫోటోను ఉంచి కథనాన్ని వెల్లడించింది. అసిస్టెంట్ కమీషనర్(ఎక్సైజ్) సంజీవ్ దూబే మాట్లాడుతూ ఆ మహిళతో మద్యాన్ని అమ్మించడం లేదని.. ఇన్స్పెక్షన్ టీమ్ లో ఆమె కూడా ఒక భాగమని చెప్పుకొచ్చారు.
మహిళలను మద్యం షాపుల్లో పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు 'అబద్ధం'. ఆమె ఎక్సైజ్ ఉద్యోగి కావడంతో అమ్మకాలను పరిశీలిస్తున్నారు.