ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్.. చాలా గొప్ప పని గురూ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 11:29 AM IST
ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్.. చాలా గొప్ప పని గురూ..!

21వ శతాబ్దంలో కూడా లింగ సమానత్వం అన్నది లేదు..! ఆఫీసుల్లో, ఇళ్లల్లో.. చాలా చోట్ల ఆడవాళ్లను ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. ఇకనైనా ఈ లింగ బేధాలు పోవాలని ఎంతో మంది చాలా ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. పరిస్థితుల్లో అంతో ఇంతో మార్పు వస్తోంది. తాజాగా ముంబై ట్రాఫిక్ విభాగం లింగ సమానత్వానికి చిహ్నంగా ఓ మంచి పని చేసింది.

ట్రాఫిక్ సిగ్నల్స్ పై మహిళల సింబల్ ను ఏర్పాటు చేశారు ముంబై ట్రాఫిక్ పోలీసులు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది ముంబై ట్రాఫిక్ విభాగం.

సాధారణంగా ట్రాఫిక్ లైట్స్ లో నడుచుకుంటూ వెళ్లడం.. లాంటి సింబల్స్ మగవాళ్ల లాగే ఉంటాయి. అందులో మార్పులు తీసుకుని వచ్చారు ముంబై ట్రాఫిక్ అధికారులు. నగరవ్యాప్తంగా 120 సిగ్నల్స్ వద్ద అధికారులు మహిళల సింబల్స్ ను ఏర్పాటు చేశారు. దాదర్, జీ నార్త్ వార్డ్ తదితర ప్రాంతాల్లో పురుషుల సిగ్నల్ బదులుగా మహిళలను సూచించే లైట్లు ఏర్పాటు చేశారు. బీఎంసీ (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) కల్చరల్ ప్రాజెక్టులో భాగంగా ఈ మార్పు చేశారు. లింగ సమానత్వం దిశగా భారతదేశం మరో అడుగు వేసిందని పలువురు ప్రశంసిస్తున్నారు.

పలు దేశాలు ముంబై తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు స్వాగతిస్తూ, తమ దేశాల్లోనూ అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి.

మాహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య థాక్రే కూడా దీనిపై ట్వీట్లు చేశారు. 'మీరు దాదర్ నుండి వెళ్తే అక్కడ చూసిన విషయం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. లింగ సమానత్వాన్ని అందరికీ తెలియజేస్తుంది' అంటూ సిగ్నల్స్ మీద మహిళల సింబల్స్ కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. యునైటెడ్ నేషన్స్ విమెన్ కూడా ముంబైలో చోటుచేసుకున్న ఈ మార్పును ప్రశంసించింది.

Next Story