Fact Check : ఒంటికి ముళ్ల కంచె చుట్టుకున్న మహిళ.. హత్రాస్ ఘటనకు నిరసన తెలుపుతోందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Oct 2020 11:08 AM ISTఒంటి చుట్టూ ముళ్ల కంచె చుట్టుకుని.. ఇనుప షీట్స్ ఒంటి మీద ధరించిన ఓ మహిళ ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. హత్రాస్ ఘటనకు నిరసనగా ఆమె భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆమె ఇలా వైవిధ్యంగా ప్రయత్నించింది అని చెబుతూ ఉన్నారు.
సెప్టెంబర్ 30, 2020న ఓ ట్విట్టర్ యూజర్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టాడు. అందులో 'ఈ ఫోటో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వానికి ఓ చెంపపెట్టు లాంటిది. ప్రపంచం మొత్తం చూస్తోంది. భారత్ లో ఆడవాళ్లపై అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో తెలిసేలా ఆమె తన ఒంటి చుట్టూ ముళ్ల కంచెను చుట్టుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో భారత్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అన్న విషయం ఆమె ఇలా తెలియజేసింది.' అంటూ పోస్టు ద్వారా రాసుకుని వచ్చాడు. ఆమె ముళ్ల కంచెతో లాంటి డ్రెస్ తో ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో ఇప్పటిది కాదు అని తెలిసింది. 2019 లో The Hans India లో ఈ ఫోటో ప్రచురితమైంది. అందుకు సంబంధించి ఆర్టికల్ ను కూడా రాశారు. “This is how Indian women are feeling right now to go out, in the light of a horrifying gang-rape and murder of a 27-year-old veterinary doctor in Hyderabad” అంటూ కథనాన్ని ప్రచురించారు. దిశ ఘటన అనంతరం భారత్ లో మహిళలు ఇలా భావిస్తూ ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే The Hans India కథనంలో కూడా ఎటువంటి నిజం లేదు.
ఈ ఫోటోలో ఉన్న మహిళ ఉన్న యూట్యూబ్ వీడియోలో చూడొచ్చు. ఇది శ్రీలంకకు చెందిన సాంప్రదాయ వస్త్రాలు అని తెలుస్తోంది.. దీన్ని ఓసారియా (Osariya) అని అంటారు.
‘ARTFARMSRILANKA’ అనే బ్లాగులో 2015 లో ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్టు చేశారు. ఇవి సంప్రదాయ వస్త్రాలు అని అందులో రాసుకుని వచ్చారు. మహిళ తనను ఒక మెటల్ షీట్ తో చుట్టుకుని ఉందని.. ఆ తర్వాత ఒంటి మీద మూళ్ళ కంచెను చుట్టుకుంది. ఈ ఫోటో 5 సంవత్సరాల కిందటిది అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.. అంతేకాకుండా ఇదొక కళ అని వారు చెబుతూ ఉన్నారు.
ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు జనని కూరే.. కొలంబోకు చెందిన ఈమె ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. “Osariya“ అనే పేజీలో ఆమె ఈ డ్రెస్ ను వేసుకుని తీసుకున్న ఫోటోలను అప్లోడ్ చేసింది. వివిధ రకాల యాంగిల్స్ లో తీసిన ఫోటోలను యూట్యూబ్ లో కూడా పోస్టు చేశారు. ఈ డ్రెస్ కు హత్రాస్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఫోటో కొన్ని సంవత్సరాల కిందటిది. హత్రాస్ ఘటనకు నిరసనగా ఇలా ప్రదర్శనను నిర్వహించారు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.