కంటి చూపు లేని వృద్ధుడి కోసం పరిగెత్తిన మహిళకు.. ఏ బహుమానం దక్కిందంటే..!
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 2:34 PM ISTమనం చేసిన మంచే మనకు తిరిగి వస్తుందని అంటారు కదా.. అలాంటి ఘటనే ఇది..! కొద్ది రోజుల కిందట కంటి చూపు లేని వృద్ధుడి కోసం పరిగెత్తిన మహిళకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ సహాయం చేసిన మహిళ సుప్రియ అని గుర్తించారు. ఆమె చేసిన మంచికి పలువురు అభినందించారు. అంతేకాదు ఆమెకు ఓ అపురూపమైన బహుమానం కూడా దక్కింది.
తిరువల్లా టౌన్ లోని జాలీ సిల్క్స్ టెక్స్టైల్ షాపులో మూడు సంవత్సరాలుగా పని చేస్తూ ఉంది. ఆమె గురించి జాయ్ అలూకాస్ గ్రూప్ ఛైర్మన్ జాయ్ అలూకాస్ తెలుసుకున్నారు. అభినందించడానికి ఆయనే వెళ్లారు. ఆమె ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లి మంచి పని చేశావమ్మా అంటూ అభినందనలు చెప్పారు. త్రిసూర్ లోని హెడ్ ఆఫీసుకు రావాలమ్మా అని కోరారు. ఆయన పిలవగానే వెళ్లిన సుప్రియకు ఊహించని బహుమానం లభించింది. ఆమెకు కొత్త ఇల్లు ఇస్తున్నామని జాయ్ అలూకాస్ సంస్థ తెలిపింది. 'ఈ ఘటనను అసలు ఊహించలేకపోయానని.. వందల మంది పని వాళ్ళు తనను అభినందించారని' ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఛైర్మన్ జాయ్ అలూకాస్ భార్య కూడా సుప్రియను అభినందించారు.
కంటిచూపు లేని ఓ వృద్ధుడు బస్సు కోసం పరిగెత్తడం చూసింది ఓ మహిళ. వృద్దుడి ప్రయత్నాన్ని చూసి ఆ మహిళ జాలిపడలేదు. అతనిని ఆ బస్సులో ఎక్కించాలనుకుని తాపత్రయపడింది. బస్సు ఆపమని అరుస్తూ పరిగెత్తింది. ప్రయాణికులు, బస్సు డ్రైవర్ గమనించించడంతో బస్సును ఆపారు. వెంటనే.. వెనుదిరిగి వెళ్లి ఆ పెద్దాయనను చేయి పట్టుకుని తీసుకువచ్చి బస్సు ఎక్కించింది.
కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమె మంచితనాన్ని పొగిడారు. ఇలాంటి కాలంలో కూడా మంచోళ్ళు ఉన్నారని ఆమెను చూస్తే అర్థమవుతుందని పలువురు అభినందించారు. ఇప్పుడు ఆమె సొంతింటి కల కూడా నిజమైంది. మనం ఎంత మంచి చేస్తే అంతే మంచి మనకు జరుగుతుందని పెద్దలు అనడం నిజమే..!