భారత్ లో వ్యాక్సిన్లు అందరికీ వేయాలంటే రెండు సంవత్సరాలైనా పడుతుంది..!

By సుభాష్  Published on  22 July 2020 7:10 AM GMT
భారత్ లో వ్యాక్సిన్లు అందరికీ వేయాలంటే రెండు సంవత్సరాలైనా పడుతుంది..!

కరోనా వైరస్ కట్టడి కోసం ఆక్స్ ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ప్రస్తుతం అన్నింటికంటే ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ దశలో ఉంది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా, వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించడంలేదని, పైగా రెట్టింపు రక్షణ కలుగుతోందని ఆస్ట్రాజెనెకా వర్గాలు తెలిపాయి.

ఈ వ్యాక్సిన్ త్వరలోనే భారత్ కు వచ్చినా భారతీయులందరికీ వ్యాక్సిన్ అందాలంటే కనీసం ఒకటిన్నర సంవత్సరం నుండి రెండేళ్ల వరకూ ఎదురుచూడాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రోటోకాల్స్ ను పాటిస్తూ 60-70 శాతం భారత జనాభాకు వ్యాక్సిన్ అందాలంటే ఈ సమయం పడుతుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తీ అయ్యి డిసెంబర్ లో అందుబాటు లోకి వచ్చినా భారత్ లోని 60 శాతం జనాభాకు వ్యాక్సిన్ అందాలంటే రెండేళ్లు పడుతుందని చెబుతున్నారు. టీబీ తో జనాలు ఎలా బ్రతుకుతున్నారో.. అలా కరోనా వైరస్ తో బతకాల్సి ఉంటుందని అంటున్నారు. భారత్ లో వ్యాక్సిన్ ను అందరికీ ఇవ్వడం పెద్ద సవాలుతో కూడుకున్నదని చెబుతున్నారు. భారత్ లో వ్యాక్సిన్ ను ఏ ధరకు అమ్ముతారో కూడా చూడాలని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ప్రభావం చూపింది. స్పెయిన్, ఇటలీలలో ఒక లాగా కరోనా వైరస్ ప్రభావం మనుషులపై ఉండగా.. భారత్ లో మరో విధంగా ఉంది. వారి జెనెటిక్స్ వేరు.. భారతీయుల జెనెటిక్స్ వేరు అని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ కూడా ఒక్కో దేశానికి చెందిన వారిపై.. ఒక్కో రకమైన ప్రభావం చూపవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తూ ఉన్నాయి.

Next Story