తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలపై సీఎంవో ప్రెస్ నోట్ లో ఏముంది?

By సుభాష్  Published on  22 July 2020 6:53 AM GMT
తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలపై సీఎంవో ప్రెస్ నోట్ లో ఏముంది?

కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించటం.. బులిటెన్ విడుదల చేయటంతోపాటు.. ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టును పలువురు ఆశ్రయిచటం.. పిటిషన్ల విచారణ సందర్భంగా అధికారుల వ్యవహారశైలిని.. వారు అందించే వివరాలపైనా తెలంగాణ హైకోర్టు పలుమార్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. సోమవారం ఇలాంటి పరిస్థితిని అధికారులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. వీటికి సంబంధించిన ప్రెస్ నోట్ ను సీఎంవో విడుదల చేసింది. అందులో ఉన్న అంశాలు ఏమిటన్న విషయంలోకి వెళితే..

- మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని గతంలో కూడా ఎవరో పిల్స్ దాఖలు చేశారు. వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా.. హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయి. హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉంది. కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

- ఎంతమందికైనా చికిత్స అందించటానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినా.. హైకోర్టు వ్యాఖ్యలు చేయటం బాధ కలిగిస్తోంది.

- హైకోర్టు ఇప్పటివరకూ 87 పిల్స్ ను స్వీకరించింది. వాటిపై విచారణ జరపటం.. వాటికి నిత్యం అధికారులు హాజరు కావటం.. చివరకు వివిధ పనుల్లో తీరిక లేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి.. వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లు కూడా కోర్టుకు రావాలని పిలవటం ఇబ్బందిగా ఉంది. అధికారులు.. వైద్యులు విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగటానికే సరిపోతోంది.

- వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం.. వైద్య శాఖ.. వైద్యాధికారులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు.

- నిత్యం వేల సంఖ్యలో పరీక్షలు జరుపుతున్నాం. ఇంత చేసినా.. హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండటం బాధ కలిగిస్తోంది. కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయటం లేదనే అభిప్రాయం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు కూడా వార్తలు రాస్తున్నాయని.. ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పని చేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యాన్ని ఈ పరిణామం దెబ్బ తీస్తుంది.

Next Story