ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన స్నేహితుడితో కనిపించడంతో ఆగ్రహాంతో ఊగిపోయిన మహిళ బంధువులు ఇద్దరిని పట్టుకుని.. గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి చెప్పుల దండ వేసి గ్రామంలో వారిని ఊరేగించారు. దీనిని చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కన్నౌజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(37) భర్త రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు స్నేహితుడు సాయం చేస్తున్నాడు. అతడు ఓ దివ్యాంగుడు(40). వీరిద్దరి మధ్య స్నేహం ఆ మహిళ బంధువులకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరు గ్రామంలోని ఓ ప్రాంతంలో బంధువుల కంట పడ్డారు. వారిని చూసి ఆగ్రహానికి లోనైన బంధువులు.. వారిద్దరిని పట్టుకుని గుండు చేయించి, ముఖానికి నల్లరంగు పూసి, చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ బంధువులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.