చైనా ప్రపంచాన్ని మోసం చేస్తోందా.. వుహాన్ లో మాస్కులు లేకుండా వేలమంది కలిసి పార్టీ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2020 1:57 AM GMTబీజింగ్ : కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న దశలో ఈ ప్రమాదకరమైన వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ లో వేలమంది పార్టీ చేసుకున్నారు. మాస్కులు లేకుండా అందరూ వాటర్ పార్క్ కు చేరుకుని వీకెండ్ ను ఎంజాయ్ చేశారు. కరోనా వైరస్ గత ఏడాది చివర్లో వుహాన్ ను వణికించగా.. ఇప్పుడు అక్కడ పరిస్థితి అంతా సాధారణ స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.
వుహాన్ లోని మాయా బీచ్ వాటర్ పార్కులో వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. మాస్కులు కూడా లేకుండా.. సామాజిక దూరం పాటించకుండా ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ లో వారు పాల్గొన్నారు. రబ్బరు ట్యూబుల మీద కూర్చొని ఎంజాయ్ చేశారు.
ఈ వాటర్ పార్క్ ను 76 రోజుల వుహాన్ లాక్ డౌన్ అనంతరం జూన్ నెలలో తెరిచారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఆ వాటర్ పార్క్ కెపాసిటీలో సగం నిండిందని.. ఆడవాళ్ళకు 50 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరూ ఎంతో ఉత్సాహంగా అక్కడి మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
వుహాన్ లో కరోనా వైరస్ పుట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని ప్రపంచ మీడియా చెబుతోంది. వైరస్ అక్కడి నుండి ఇతర దేశాలకు పాకింది. వుహాన్ నగరం రాజధానిగా ఉన్న హుబే ప్రావిన్స్ లో ఇటీవలి కాలంలో కరోనా కేసులు తగ్గడంతో అక్కడి ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు.
అయితే ఇలా బహిరంగంగా సామూహికంగా ఎంజాయ్ చేస్తుండడం వలన ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనాకు వ్యాక్సిన్ తీసుకుని రావడం ద్వారానే తిరిగి సాధారణ స్థితికి రాగలం అని అనుకుంటూ వుంటుంటే.. చైనాలో వాటర్ పార్క్ లకు భారీగా ప్రజలు రావడం చూస్తే చైనా ఇప్పటికే వ్యాక్సిన్ ను కనిపెట్టేసిందా అన్న అనుమానాలు రాకమానదు.