రాజమౌళీ.. తొందరపడాలయ్యా.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 5:23 AM GMT
రాజమౌళీ.. తొందరపడాలయ్యా.!

మన దర్శక ధీరుడు రాజమౌళికి ‘మహాభారతం’ కలల ప్రాజెక్టు అన్న విషయం అందరికీ తెలిసిందే. దాని గురించి ఆయన ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నాడు. ఆ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించడానికి తనకింకా అనుభవం కావాలని చెప్పి కొన్నేళ్లయింది. ఐతే జక్కన్న గత దశాబ్దంన్నర కాలంలో తీసిన సినిమాల వరస, వాటి స్థాయి చూస్తే మాత్రం ఆయనకు ఆ అనుభవం వచ్చేసిందనే అంతా అనుకుంటున్నారు.

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో మునిగి ఉన్న రాజమౌళి.. దీని తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత మాత్రం ‘మహాభారతం’ పని మొదలుపెట్టాల్సిందే అన్నది ఆయన అభిమానుల అభిమతం. అందులోనూ తాజా పరిణామాలు చూశాక జక్కన్న ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదనే అభిప్రాయం బలపడుతోంది.

కొన్నేళ్ల కిందట అల్లు అరవింద్ ‘రామాయణం’ మీద ఓ భారీ చిత్రం తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని బడ్జెట్ అప్పుడే రూ.500 కోట్లని అన్నారు. ఐతే ఈ సినిమా ప్రకటనకే పరిమితం అయింది. ఆ తర్వాత ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కట్ చేస్తే.. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ రామాయణ కథతో ప్రభాస్ హీరోగా సినిమా అనౌన్స్ చేశాడు.

దాదాపు అల్లు వారు చెప్పిన బడ్జెట్లోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా స్కేల్ చూస్తే సమీప భవిష్యత్తులో ఇంకెవరూ ‘రామాయణం’ను టచ్ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. అల్లు వారి ప్రాజెక్టు దాదాపు డ్రాప్ అయినట్లే అనుకుంటున్నారు. జక్కన్న మహాభారతం గురించి మాట్లాడిన తర్వాత ఆమిర్ ఖాన్ సైతం ఆ కథతో సినిమా చేయడానికి కొంత ప్రయత్నం చేయడం తెలిసిన సంగతే.

మహాభారతం మీద గతంలోనూ సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. కానీ గతంలో వచ్చినవి వేరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా భారీ స్థాయిలో ఆ కథను తెరకెక్కించడానికి రెడీ అయితే.. సమీప భవిష్యత్తులో ఇంకెవరూ దాన్ని టచ్ చేయలేని పరిస్థితి తలెత్తతుంది. కాబట్టి ‘ఆదిపురుష్’ తరహాలోనే బాలీవుడ్లో ఇంకెవరైనా మహాభారత కథపై కర్చీఫ్ వేయడానికి ముందే జక్కన్న అప్రమత్తమై.. సినిమా మొదలుపెట్టడం మంచిది.

Next Story