మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. ఉద్దవ్‌ ఠాక్రే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2020 10:38 AM GMT
మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. ఉద్దవ్‌ ఠాక్రే

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే పై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కాగా.. కంగనా వ్యాఖ్యలపై ఆదివారం ఠాక్రే ఘాటుగానే స్పందించారు. తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. మహారాష్ట్రకు చెడ్డ పేరు తెచ్చేందుకు రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం వీటిపై తాను స్పందించాలనుకోవడం లేదన్నారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక, ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌ పక్కన బెట్టి మరీ స్పందిస్తానని తెలిపారు.

తాను రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నా అని.. తాజా వివాదాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఠాక్రే స్పష్టం చేశారు. మొదటితో పోలిస్తే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్నారు. వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలను చేపడుతోందని వివరించారు. కరోనా నేపథ్యంలో ఈనెల 15 నుంచి నా కుటుంబం - నా బాధ్యత’ అన్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా డోర్‌టూడోర్‌ వైద్య సేవలను విస్తరిస్తామన్నారు. డిసెంబర్, జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుశాంత్ రాజ్ పుత్ మరణం వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో, కొన్నిరోజులుగా కంగనా రనౌత్ కు, అధికార శివసేన నేతలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర సర్కారు అక్రమ నిర్మాణం అంటూ ముంబయిలో ఆమె కార్యాలయం కూల్చివేసింది. దాంతో కంగనా కూడా తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుని చండీగఢ్ నుంచి ముంబయి వచ్చారు. గత వారం రోజులుగా సాగుతున్న వీరిద్దరి మధ్య వివాదం తాజాగా రాష్ట్ర గవర్నర్‌ వద్దకు చేరనుంది. ఆదివారం సాయంత్రం కంగనా రనౌత్‌ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ కానున్నారు.

Next Story
Share it