ఉద్ధవ్ థాక్రే మీ అహంకారం కూలిపోతుంది: కంగనా

By సుభాష్  Published on  10 Sep 2020 2:00 AM GMT
ఉద్ధవ్ థాక్రే మీ అహంకారం కూలిపోతుంది: కంగనా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చివరికి రాజకీయ రంగును పూసుకుంది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తోంది. 'శివసేన వర్సెస్ కంగనా' అంటూ హైడ్రామా నెలకొంది. శివసేన, కంగనాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్న తరుణంలో బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) ఇవాళ ఉదయం కంగనా కార్యాలయాన్ని కూల్చివేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణంగా బీఎంసీ అధికారులు చెప్పారు.

కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేత కూడా బుధవారం నాడు జరిగిపోయింది. దీనిపై కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది.

‘ఉద్ధవ్‌ థాక్రే మీరు ఏమనుకుంటున్నారు. మూవీ మాఫీయాతో చేతులు కలిపి నా భవనాన్ని కూల్చివేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నానని అనుకుంటున్నారా? ఈ రోజు నా ఇల్లు కూలిపోయింది.. రేపు మీ అహంకారం కూలిపోతుంది’ అంటూ కంగనా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఒక విధంగా మీరు నాకు సహాయం చేశారు. కశ్మీరీ పండితులు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థమైంది, ఈ రోజు అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ సందర్భంగా నేను ఓ ప్రతిజ్ఞ చేస్తున్నా.. ఒక అయోధ్య మీదనే కాదు కశ్మీరీలపై కూడా సినిమా తీస్తాను.. జై హింద్.. జై మహారాష్ట్ర అంటూ వీడియోను ముగించింది కంగనా.

ఆమె సినిమాల్లో పని చేయడానికి జంకుతున్నారా:

కంగనాను సపోర్టు చేస్తున్న వాళ్ళు కొందరైతే.. విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కంగనాతో పని చేయడం లేదని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ తాజాగా చెప్పుకొచ్చారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ చిత్రాన్ని తిరస్కరించాను. ఆమెతో పనిచేయాలంటే అసౌకర్యంగా ఫీలయ్యాను. అదే విషయాన్ని చిత్ర నిర్మాతలకు చెప్పానని పీసీ శ్రీరామ్ అన్నారు. నిర్మాతలు పరిస్థితి అర్థం చేసుకున్నారని.. మనకు ఏది సరైనదని అనిపిస్తే ఒక్కోసారి అదే చేయాలని ఆయన అన్నారు.

మీలాంటి లెజండ్ తో వర్క్ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాను సర్. ఇది నాకు పూర్తిగా నష్టం లాంటిదే అంటూ కౌంటర్ ఇచ్చింది కంగనా..! నాతో పనిచేయడానికి అసౌకర్యంగా ఫీలయ్యేంత విషయం ఏమిటో నాకు తెలియడం లేదని కూడా చెప్పుకొచ్చింది. మీరు సరైన నిర్ణయమే తీసుకున్నందుకు నాకు ఆనందంగానే వుంది అంటూ తెలిపింది కంగనా..!

Next Story
Share it