మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ గెలిస్తే అమెరికాకే అవమానం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Sep 2020 2:15 PM GMT
మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ గెలిస్తే అమెరికాకే అవమానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై మరోసారి నోరు పారేసుకున్నాడు. మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ గెలిస్తే అది మొత్తం అమెరికాకే అవమానమని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కమలా హ్యారిస్ ను అమెరికా ప్రజలు ఇష్టపడబోరని.. ఆమె అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం ఆసక్తికరమైన విష‌యమంటూ కౌంటర్ వేస్తున్నాడు ట్రంప్.

ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నప్పటి నుండీ ఆమె మీద తీవ్రమైన పదాలతో దాడి చేస్తున్నారు ట్రంప్. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న బిడెన్ ను కూడా చైనాకు తొత్తు అని అమెరికా ప్రజలకు చూపే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లేనని ఆ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే గొప్ప ఎకానమీ అమెరికాదని కానీ చైనా తీసుకుని వచ్చిన ప్లేగు కారణంగా ఆ ఎకానమీని మూసి వేసేలా పరిస్థితులు వచ్చాయని.. కానీ మన ఎకానమీ నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. చైనా, లూఠీలు చేస్తున్న వాళ్లు బిడెన్ గెలవాలని కోరుకుంటూ ఉన్నారని.. ఎందుకంటే బిడెన్ పాలసీలు అమెరికాను పాతాళంలోకి తీసుకుని వెళతాయని భావిస్తూ ఉన్నారని అదే వారు కోరుకుంటోందని అన్నారు.

నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు ట్రంప్. తనను మించిన పర్యావరణవేత్త మరొకరు లేరని స్వయంగా అభివర్ణించుకున్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు థియొడర్ రూజ్ వెల్ట్ గొప్ప పర్యావరణవేత్తగా గుర్తింపు పొందారని, ఆయన తర్వాత మళ్లీ అంతటి పేరు తనకే వచ్చిందని చెప్పుకొచ్చారు.

పర్యావరణాన్ని రక్షించడానికి తాను ఎన్నో చేశానని.. సౌత్ కరోలినా, ఫ్లోరిడా, జార్జియా ప్రాంతాల్లో సముద్ర గర్భ తవ్వకాలపై తాత్కాలిక నిషేధం విధించానన్నారు. తాను చేస్తున్న మంచి పనుల గురించి ఎంతో మంది సెనేటర్లు ప్రశంసించారని సొంత డబ్బా కొట్టుకున్నారు ట్రంప్.

Next Story