దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన లవ్ జిహాద్.. ఆ దుష్ట శక్తిని అంతం చేస్తామంటున్న నాయకులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2020 2:26 PM GMT
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన లవ్ జిహాద్.. ఆ దుష్ట శక్తిని అంతం చేస్తామంటున్న నాయకులు

‘లవ్‌ జిహాద్‌’పై కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లవ్‌ జిహాద్’‌ అన్నది ఓ దుష్ట శక్తి అని.. ఈ దుష్ట శక్తికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నామని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదించిందని.. త్వరలోనే చట్టం రూపొందిస్తామని వెల్లడించారు. అలహాబాద్‌ హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటకలో కూడా ఓ చట్టం తీసుకురాబోతున్నామని.. కేవలం వివాహం కోసం మతం మార్చుకోవడం అంగీకారం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.

ఉత్తరప్రదేశ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వివరించారు. లవ్‌ జిహాద్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని.. ఈ విషయం గురించి ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించామని అన్నారు.

కొద్దిరోజుల కిందటే లవ్‌ జిహాద్ మీద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. లవ్ జిహాద్ అణచివేసేందుకు ఉక్కుపాదం మోపుతామని.. అందుకోసం కఠినచట్టం తీసుకువస్తామని అన్నారు. తమ గుర్తింపును దాచిపెట్టి హిందూ మహిళల గౌరవంతో ఆటలాడేవారు ఇకపై తమ పంథాను మార్చుకుంటే బాగుంటుందని అన్నారు. మా సోదరీమణుల జీవితాలను భగ్నం చేసేవారు ఇకపై తీరు మార్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. లేకపోతే వారి 'రామ్ నామ్ సత్య యాత్ర' (అంతిమయాత్ర) ప్రారంభం అవుతుందని హెచ్చరించారు.

కేవలం పెళ్లి కోసమే మతమార్పిడి చేయడం చెల్లదని, పెళ్లికి మతమార్పిడి అవసరంలేదని అలహాబాద్ హైకోర్టు ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. మతాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఇటీవలే తోసిపుచ్చింది అలాహాబాద్ హైకోర్టు. పెళ్లి కోసమే మతం మార్చుకోవడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. ముస్లిం అయిన యువతి నెల రోజుల క్రితమే హిందూ మతం తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

పెళ్లి చేసుకునేందుకే మతం మారినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠీ 2014లో ఇదే కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ఓ యువతి ఇస్లాంలోకి మారి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. న్యాయమూర్తి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి చేసుకోవడం కోసమే మతం మారడం సరైంది కాదని అన్నారు. ఆయా మత విశ్వాసాలు, సంప్రదాయల గురించి ఎటువంటి అవగాహన లేకుండా కేవలం పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే మతాలను స్వీకరించడం ఆమోదనీయం కాదని సూచించారు.

Next Story
Share it