భర్త బిర్యానీ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య

By సుభాష్  Published on  27 Jun 2020 9:36 AM GMT
భర్త బిర్యానీ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య

కొన్ని కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి నమ్మాలా..? వద్దా..? అనే రీతిలో ఉంటాయి. సాధారణంగా అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. అనుమానంతో చిత్ర హింసలు, వివాహేతర సంబంధాలు.. భార్య భర్తల మధ్య గొవల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం. కానీ భర్త బిర్యానీ కొనివ్వలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎప్పుడైనా చూశారా..? వింటూ వింతగా, షాకింగ్‌లా ఉంది కదూ. ఇది నిజమే. భర్త తనకు బిర్యానీ తీసుకురాలేదనే కోపంతో భార్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో మనోహరన్‌, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. ఇక మనోహరన్‌ శిల్పాల తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. కాగా, తనకు బిర్యానీ తినాలని ఉందని, తీసుకురావాలని శరణ్య భర్తను కోరింది. అయితే తన దగ్గర డబ్బులు లేవని, మరోసారి తీసుకొస్తానని చెప్పి మనోహరన్‌ బయటకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య.. ఇంటి దగ్గర ఉన్న బైక్‌ వద్దకు వెళ్లి పెట్రోల్‌ తీసి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఇరుగుపొరుగు వారు గమనించి భర్తకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం మహాబలిపురంలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

భార్యకు హోటల్‌ బిర్యానీ అలవాటు చేసిన భర్త

కాగా, పెళ్లి అయిన తర్వాత భార్యకు హోటల్ నుంచి బిర్యానీ తీసుకురావడం అలవాటు చేశాడు భర్త మనోహరన్‌. అప్పటి నుంచి ఇంట్లో చేసిన బిర్యానీకంటే హోటల్‌లో చేసిన బిర్యానీ శరణ్య తెగ ఇష్టపడేది. ఇక పిల్లలు పుట్టిన తర్వాత కూడా అప్పుడప్పుడు హోటల్‌ నుంచి బిర్యానీ పార్శిల్‌ తీసుకురావడం చేస్తుండేవాడు.

లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు

ఇక కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ కారణంగా మనోహరన్‌కు ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. అదే సమయంలో భార్య బిర్యానీ అడగడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఈ భార్య భర్తల మధ్య గొడవ మొదలైంది. ముందే ఆర్థిక ఇబ్బందులు.. అందులో ఇంట్లో వాళ్లందరికి బిర్యానీ కావాలంటే సుమారు 600పైగా ఖర్చు అవుతుందని, తన వద్ద అంత డబ్బులు లేని కారణంగా బిర్యానీ తీసుకురాలేకపోయానని, తర్వాత తీసుకొస్తానని భర్త చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story