తమిళనాడులో రూ.500కోట్ల మోసం.. హైదరాబాద్‌లో భార్య చేతిలో హతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 4:37 AM GMT
తమిళనాడులో రూ.500కోట్ల మోసం.. హైదరాబాద్‌లో భార్య చేతిలో హతం

తమిళనాడులో ప్రజలను మోసం చేసి రూ.500కోట్లను ముంచిన స్కామ్‌లో నిందితుడు. ఆకేసులో పోలీసులు అరెస్టు చేయడంతో బెయిల్‌ పై విడుదలై హైదరాబాద్‌కు వచ్చాడు. మౌలాలి ప్రాంతంలో నివాసం ఉంటున్న అతడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. విచారణ చేపట్టిన పోలీసులు భార్యనే అతడిని హతమార్చిందని తెలిసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకరన్‌ అలియాస్‌ క్రిస్టి(50), సుకన్య(32) దంపతులు చెన్నైలో నివసించేవారు. మనీ బ్యాక్‌ పాలసీ అంటూ భారీ స్కామ్‌కు తెరతీశాడు. ప్రజల నుంచి దాదాపు రూ.500కోట్లు కొట్టేశాడు. అతడిని 2012లో తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. 8నెలల అనంతరం అతడు బెయిల్‌ పై బయటికి వచ్చాడు. తమిళనాడులో ఉండలేక, హైదరాబాద్‌కు వచ్చి మౌలాలిలో ఉంటున్నాడు. కాగా.. అదే కేసులో 2013లో అతడి భార్య సుకున్యను కూడా తమిళనాడు సీఐడీ విభాగం అరెస్టు చేసింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె జైలులో ఉంది. 2018లో ఆమె బెయిల్‌పై విడుదలైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా.. వారు ప్రభాకరన్‌ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.

బెయిల్‌పై బయటికి వచ్చిన సుకన్యకు భర్త ఆచూకీ తెలియలేదు. పిల్లలను తీసుకుని చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని బంధువుల ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఈక్రమంలో భర్త ప్రభాకరన్‌ మౌలాలీలో ఉంటున్నాడని తెలుసుకుంది. ఈ నెల 18న భర్త ఉంటున్న ఆండాల్‌నగర్‌కు వచ్చింది. అప్పటికే ప్రభాకరన్‌ పక్షవాతం బారీన పడ్డాడు. భార్యను చూసి కంగుతిన్నాడు. ఆమెతో కలిసి జీవించడం అతడికి ఇష్టం లేదు. తిరిగి వెళ్లిపోవాలని గొడవ పెట్టుకున్నాడు. ఈ నెల 23న రాత్రి లేవలేని స్థితిలో ఉన్న భర్త ముఖంపై దిండును గట్టిగా అదిమి చంపేసింది. బయటి వారికి భర్త నిద్రలో చనిపోయినట్లు చెప్పింది.

అయితే.. స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో తానే ఈ హత్య చేసినట్లు సుకన్య అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి పోలీసు అధికారులు తెలిపారు.

Next Story