హర్యానాలో జాట్ల ఓట్లు ఎవరికి పడతాయి..? జాట్లు మూకుమ్మడిగా ఏ పార్టీకి మద్దతివ్వబోతున్నారు..? రాజ కీయంగా తమ పట్టును నిలబెట్టుకోవడానికి జాట్లు ఈసారి కొత్త ఎత్తుగడ వేయబోతున్నారా..? జాటవేతరుల ఓట్లపై బీజేపీ దృష్టి పెట్టడానికి కారణమేంటీ..?

ప్రతి రాష్ట్రంలో కొన్ని సామాజికవర్గాలు ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాయి. మహారాష్ట్రలో మరాఠీలు, బెంగాల్‌లో బెంగాలీలు, యూపీలో యాదవులు ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వర్గానిది పెత్తనం. హర్యానా విషయానికి వస్తే ఇక్కడ జాట్ల ఆధిపత్యం ఎక్కువ. రాజకీయంగా, పారిశ్రామికంగా బలంగా ఉండడంతో పాటు అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న వర్గం జాట్లు. పంజాబ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా జాట్ వర్గీయులు ఉన్నారు. హర్యానా జనాభాలో జాట్ల శాతం 29. ముఖ్యమంత్రి పీఠాన్ని ఖరారు చేయడంలో జాట్లు కీలక పాత్ర పోషిస్తారు.

ఛత్తీస్‌ బిర్‌దారీస్‌… అంటే 36 సామాజికవర్గాలు చాలా కాలంగా హర్యానాలో కలిసిమెలిసి జీవిస్తున్నాయి. హిసార్, భివానీ, మహేంద్రఘర్, రోహతక్, ఝజ్జార్, సోనిపట్, జింద్, కైతాల్‌ ప్రాంతాల్లో జాట్‌ సామాజిక వర్గం అధికం. ఈ ప్రాంతాలను జాట్‌బెల్ట్‌గా వ్యవహరిస్తారు. మాజీ సీఎంలు భజన్‌ లాల్, భూపీందర్‌ సింగ్ హుడా, ఓం ప్రకాశ్‌ చౌతాలాలు ఇదే ప్రాంతం నుంచి గెలిచి రాజకీయాల్లో చక్రం తిప్పారు. 2014లో బీజేపీ వ్యూహం మార్చింది. జాటేతర నాయకునికి సీఎం పీఠాన్ని అప్పగించింది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి 2014లో జాటేతర సామాజికవర్గం నుంచి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అధికారం చేపట్టారు.

2014లో జాట్ బెల్ట్‌లో బీజేపీకి పెద్దగా కలసి రాలేదు. 2016లో రాష్ట్రాన్ని కుదిపేసిన జాట్ల రిజర్వేషన్‌ ఉద్యమం కమలదళాన్ని దెబ్బతీసింది. ఐతే, లోక్‌సభ ఎన్ని కల నాటికి పరిస్థితి మారిపోయింది. మొత్తం 10 ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు తమకే పట్టం కడతారని కాషాయ దళం దీమాగా ఉంది. జాట్ల ఆధిపత్యంలోని హర్యానాలో తిరిగి పాగావేసేందుకు అబ్‌ కీ బార్‌ సత్తార్‌ పార్‌ అనే నినాదంతో బీజేపీ బరిలోకి దిగింది.

జాట్ బెల్ట్ కాంగ్రెస్‌కు పెట్టని కోట. రోహ్‌తక్, సోనాపేట్, ఝజ్జార్‌లు కాంగ్రెస్‌కి పట్టున్న ప్రాంతాలు. గత ఎన్నికల్లో ఈ ఏరియాలో కాంగ్రెస్‌ పార్టీకి 15 సీట్లు వచ్చాయి. చండీగఢ్, పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్‌లలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. ఈ ప్రాంతంలో జాటేతరులది ఆధిక్యం. బీజేపీ సామాజిక ఎత్తుగడలో భాగంగానే గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై దృష్టిసారించింది. పంజాబీ భాష మాట్లాడే బనియా సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలన్న కాషాయ పార్టీ ఎత్తుగడ ఫలించింది. ఈసారి సైతం బీజేపీ విజయాన్ని కైవసం చేసుకునేందుకు ఇదే వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. మాజీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ సీఎం ఖట్టర్‌ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడని బీజేపీ ప్రకటించడం అందులో భాగమే.

హర్యానాలో తమ ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు స్థానిక అంశాలను బలంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం ఖట్టర్‌ క్లీన్‌ రికార్డ్, ప్రధాని మోదీ ఛరిష్మాను నమ్ముకుంది. మరి జాట్లు, జాటేతరులు ఎవరికి పట్టం కడతారో ఈనెల 23న తేలిపోనుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.