ఈ కరోనా నన్నేం చేస్తుందని కొందరు, కరోనా వల్ల నేను పోతే నా వల్ల ఇంకొందరు కూడా పోవాల్సిందే అని ఆలోచిస్తున్న వారిని గురించి వింటున్నాం . కానీ ఇదిగో ఈ యువకుల్ని చూడండి. తమ వల్ల తమ వారికి ఏమీ కాకూడదన్న యువకుల ఆలోచన అందరితోనూ ప్రశంసలు అందుకునేలా చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో సైతం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. స్వయంగా లాక్‌డౌన్ విధించుకుంటూ… కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… ఇటీవలే చెన్నై నుంచీ బెంగాల్… పురూలియాలోని… బలరాంపూర్‌లో ఉన్న వంగిడి గ్రామ ప్రజలు… చెట్లపై క్వారంటైన్ విధించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

లాక్‌డౌన్ నేపథ్యంలో చెన్నై నుంచి గ్రామానికి చేరుకున్న కూలీలు.. గ్రామంలోకి వెళ్లకుండా చెట్లనే నివాసాలుగా మార్చుకున్నారు. 14 రోజులపాటు చెట్లపైనే నివసించాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు లాక్ డౌన్ నేపథ్యంలో చెన్నై నుంచి స్వస్థలానికి చేరుకున్నారు. అయితే, గ్రామంలోకి వెళ్లి మరింత మందికి ప్రమాదకరంగా మారడం ఇష్టంలేని ఆ యువకులు.. గ్రామం బయట ఉన్న మామిడి, రావిచెట్లను తమ నివాసంగా మార్చుకున్నారు. గ్రామస్థుల సాయంతో మంచం, దోమతెర ఏర్పాటు చేసుకుని 14 రోజులపాటు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు. వారి నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. గత సోమవారం నుంచే వారు అక్కడ నివసిస్తున్నారు.

ఖరగ్‌పూర్‌లో వైద్యులు తమకు పరీక్షలు నిర్వహించారని, తమలో ఎవరికీ కరోనా సోకలేదని తేలినప్పటికీ 14 రోజులపాటు నిర్బంధంలో ఉండాలని సూచించారని యువకులు చెబుతున్నారు. నిరుపేదలైన వీరి ఇల్లు ఉండటానికి చాలా చిన్నవి. వాటిలో గదులన్నవే లేవు. ఒకటే గది లాంటి ఇంట్లో అందరూ నివసించాల్సి ఉంటుంది. అలా కలిసి ఉంటే… కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండటంతో… తమను తాము క్వారంటైన్ చేసుకున్నామంటున్నారు. ఏనుగులనుంచి తమ పంటలను రక్షించుకొనేందుకు ఇలా చెట్లు ఎక్కి కాపలా కాసేవాళ్లమని, ఇప్పుడు ప్రమాదకరమైన కరోనా రక్కసి నుంచి తమ గ్రామ ప్రజలను కాపాడుకోవటానికి ఇలా ఉంటున్నామని చెబుతున్న యువకుల నిర్ణయాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.