తెలంగాణలో ఆదివారం నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయా..?

By సుభాష్  Published on  28 March 2020 4:07 PM GMT
తెలంగాణలో ఆదివారం నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయా..?

కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనాను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. అన్ని విద్యాసంస్థలు, షాపులతో పాటు వైన్స్‌ షాపులు సైతం మూసివేశారు. దీంతో మందుబాబులకు ఎక్కడలేని కష్టాలు వచ్చిపడ్డాయి. మందు సుక్కలేక నానా అవస్థలు పడుతున్నారు. 'కేసీఆర్‌ సార్‌ వైన్స్‌ షాపులు తెరిపించండి' అంటూ వేడుకుంటున్నారు. రోజుకు కొన్ని గంటలైనా సరే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఎవరికి తోచిన విధంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మార్చి 29 తేదీ అంటే ఆదివారం రోజు వైన్స్‌ షాపులు తెరుస్తారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు తెరిచి ఉంటాయని, అలాగే ప్రతి వైన్స్‌ షాపు వద్ద ఒక ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉండి పరిస్థితిని సమీక్షించాలి. మద్యం షాపునకు వచ్చే వ్యక్తుల మధ్యం దూరం ఉండేలా చూడాలి.. అని సారాంశం ఉన్న ఓ జీవో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక జీవో చూసిన మద్యం ప్రియులు షేర్లు చేసుకుంటూ రేపు మద్యం షాపులు తెరుస్తారంటూ తెగ సంబరపడిపోతున్నారు.

Ts Wine

ఇందులో వాస్తవమెంత..?

ఇక ఆదివారం నుంచి వైన్స్‌ షాపులు తెరుస్తారంటూ వాట్సాప్‌లలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ జీవో నకిలీదని, ఎవ్వరూ కూడా నమ్మవద్దని ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కొందరు కావాలని ఇలాంటివి ఫేక్‌ సమాచారం సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మవద్దని, అంతే కాదు మద్యం షాపులు తెరుస్తారంటూ నకిలీ ఉత్తర్వులను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్న వారిపై ఆబ్కారీ శాఖ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. పోర్జరీ సహా పలు కేసుల కింద నిందితులపై కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనా సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచే ఏదైనా ప్రకటన చేస్తే తప్ప, ఇలాంటివి నమ్మి మోస పోవద్దని సూచిస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్‌ శాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story