తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవడం మొదలైంది. నాలుగు రోజులు పాటు ఆగి.. మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.16 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, భువనగిరి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి ఎగువనుంచి గోదావరిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గోదావరి పరివాహక జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. వర్షాలపై సీఎస్ సోమేశ్ కుమార్ కూడా శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.