ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రేపటి వరకు దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇది తీరానికి చేరుకునే సమయానికి మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జవాద్ తుఫాన్ ఎఫెక్ట్‌తో కోస్తాంధ్రాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాల నుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు. తీరం వెంబడి గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలపడంతో 17,18 తేదీల్లో తిరుమల నడక దారిని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో నడక మార్గంలో భక్తులకు టీటీడీ అనుమతి నిరాకరించింది.