వామ్మో.. ఎండలు
Unpredictable Changes In Weather. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ఎండల కారణంగా జనం అల్లాడిపోతున్నారు.
By Medi Samrat Published on 16 May 2023 5:30 PM IST
ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ఎండల కారణంగా జనం అల్లాడిపోతున్నారు. రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో భారీ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారతీయ వాతావరణ శాఖ హెచ్చించింది. ఇవాళ, రేపు కోస్తా ఆంధ్రా జిల్లాల్లో హీట్‌వేవ్ వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి. ఇవాళ రాజమండ్రిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదు అయ్యింది. ఏపీలోని రాజమండ్రి, గుంటూరు, ఏలూరులో ఇవాళ 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలోనూ విపరీతమైన వేడి నెలకొంది. అక్కడ 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చిలకలూరిపేటలో కూడా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి.
తెలంగాణలో వేడి తీవ్రత అధికంగా ఉంది. అనేక ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొత్తగూడెం, మిర్యాలగూలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచలో 46, ములుగు, నల్గొండలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంది. వడదెబ్బకు తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ఇద్దరు మృతి చెందారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.