Weather alert: తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు
రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By అంజి Published on 20 March 2023 7:00 AM GMTWeather alert: తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు
కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా పశ్చిమ విదర్భ వరకు ద్రోణి కొనసాగుతున్నందున రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ర్ణాటక, జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఈ ద్రోణి కొనసాగుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరో 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో వర్షం కురవనుంది. రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపురంలో 15.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అకాల వర్షంతో పాటు ఈదురు గాలులు, వడగళ్ల వానతో తెలంగాణ వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. గత రెండు రోజులుగా కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న, మామిడి, వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్‌తోపాటు జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లోని గంగాధర, రామడుగు, శంకరపట్నం, మానకొండూర్, హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, చిగురుమామిడి తదితర మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. గ్రౌండ్ లెవల్ సర్వే నిర్వహించి పంట నష్టం నివేదిక అందజేయాలని రాజన్న-సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. రైతులతో మమేకమై, సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలం చెల్‌గల్‌లో దెబ్బతిన్న పంటలను జగిత్యాల డీఏవో సురేష్‌కుమార్ పరిశీలించారు. కథలాపూర్ మండలం కలికోట, మేడిపల్లి మండలం పసునూరు, మోతుకురావుపేటలో దెబ్బతిన్న మొక్కజొన్న, నువ్వుల పంటలను ఆయన పరిశీలించారు.