తెలంగాణ‌లో నేడు, రేపు భారీ వ‌ర్షాలు

Today and Tomorrow Heavy rains in Telangana.తెలంగాణ రాష్ట్రంలో బుధ‌, గురు వారాల్లో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2022 8:19 AM IST
తెలంగాణ‌లో నేడు, రేపు భారీ వ‌ర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో బుధ‌, గురు వారాల్లో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. 900 మీటర్ల ఎత్తున ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్‌ ప్రాంతం వరకూ విస్తరించిందని తెలిపింది. మ‌రోవైపు 1500 మీట‌ర్ల ఎత్తులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరంలో బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధ‌వారం ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, సంగా‌రెడ్డి, మెదక్‌, కామా‌రెడ్డి జిల్లాల్లో అక్కడ‌క్కడ భారీ వర్షాలు కురు‌స్తా‌యని తెలి‌పింది.

ఇదిలా ఉంటే.. మంగ‌ళ‌వారం రాజ‌ధాని హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసింది. తెల్లవారుజామునే దంచికొట్టిన వాన మధ్యాహ్నానికి తగ్గిపోయింది. మళ్లీ సాయంత్రం కుండపోతగా కురిసింది. సాయంత్రం ఏక‌ధాటిగా గంట‌సేపు వ‌ర్షం కురవ‌డంతో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర్ష‌పు నీరు ర‌హ‌దారులపై చేర‌డంతో ప‌లు ప్రాంతాల్లో వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో అర్ధరాత్రి పూట.. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వాన ప‌డింది.

Next Story