ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాగా ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. కాగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదు, అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు.