Telangana: టార్చర్ చూపిస్తున్న ఎండలు.. తాళలేక పోతున్న ప్రజలు.. 46⁰ డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
ఎండలు తీవ్రస్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. ఉష్ణోగ్రత స్థాయి ఏకంగా 46⁰ సెల్సియస్‌ను దాటేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 May 2024 2:45 PM GMTTelangana: టార్చర్ చూపిస్తున్న ఎండలు.. తాళలేక పోతున్న ప్రజలు.. 46⁰ డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: ఎండలు తీవ్రస్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. ఉష్ణోగ్రత స్థాయి ఏకంగా 46⁰ సెల్సియస్‌ను దాటేసింది. తెలంగాణలో ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన వేసవి సీజన్లలో ఒకటి ఇదని వాతావరణ నిపుణులు అంటున్నారు. మే మొదటి వారం వరకు సుదీర్ఘమైన హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉండడంతో ఉష్ణోగ్రత తగ్గే సూచనలు అసలు కనిపించడం లేదు. చెదురుమదురు వర్షాలు అప్పుడప్పుడు పడితే మాత్రమే తాత్కాలిక ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
జిల్లా వ్యాప్తంగా ఉక్కపోత పరిస్థితులు:
గురువారం నాడు తెలంగాణలోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46⁰ సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. ఇది ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తెలియజేస్తుంది. నల్గొండ అత్యంత ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా రికార్డును సృష్టించింది. 46.6⁰ సెల్సియస్-ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదైంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ప్రకారం.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలో ఒక్కొక్కటి 46.5⁰ సెల్సియస్‌గా నమోదయ్యాయి. జగిత్యాల్, పెద్దపల్లి, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46.4⁰ సెల్సియస్ కు చేరుకున్నాయి.
హైదరాబాద్‌పై ప్రభావం:
హైదరాబాద్ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. నగరంలో ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 43.4⁰ సెల్సియస్‌గా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) లిమిట్స్ లో ఉష్ణోగ్రత 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. ఈ భారీ ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు.
హీట్‌వేవ్-సంబంధిత మరణాలు:
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఒకరు ఎండవేడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఏటా 5 నుండి 8 హీట్‌వేవ్ సంబంధిత మరణాలు సంభవిస్తూ ఉండడంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
నిపుణుల సూచనలు:
వాతావరణ నిపుణులు బాలాజీ తారిణి ప్రకారం.. ఈ ఏప్రిల్ హైదరాబాద్‌లో అత్యంత ఉష్ణోగ్రత నమోదైంది. 2020 తర్వాత ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇది రెండవది. Xలో “గత సంవత్సరం చాలా చల్లగా ఉంది, గరిష్ట ఉష్ణోగ్రత 39.4⁰ సెల్సియస్‌కు చేరుకుంది. అయితే, ఈ సంవత్సరం, ఉష్ణోగ్రతలు 42.3⁰ సెల్సియస్‌కు పెరిగాయి, ఏప్రిల్‌లో ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది" అని పోస్టు పెట్టారు.
ఉష్ణోగ్రతల పెరుగుదలకు యాంటీ-సైక్లోనిక్ కార్యకలాపాలు, వాతావరణ మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. అది నిజమేనని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే. మనం ఈ భూమిని సర్వనాశనం చేస్తున్నాం.
మే 5 నుండి 11 వరకు కాస్త ఉపశమనం:
స్కైమెట్ కు చెందిన మహేష్ పలావత్ మాట్లాడుతూ “రాబోయే కొన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా చాలా వేడి, పొడి గాలులు వీస్తాయని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మే 5 నుండి మే 11 వరకు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీవ్రమైన హీట్‌వేవ్ నుండి కాస్త ఉపశమనాన్ని అందజేస్తుంది." అని తెలిపారు.
ఈ వేడిగాలులతో తెలంగాణ రాష్ట్రం సతమతమవుతూ ఉంది. విపరీతమైన వాతావరణ మార్పులకు మనుషులు చేస్తున్న ఎన్నో పనులు మూల కారణాలుగా చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రజల శ్రేయస్సును కాపాడేందుకు సమిష్టి ప్రయత్నాలు అవసరం. భూతాపాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది.