ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణ‌లో కూడా..

Telugu States Rain Updates. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు పలుకరిస్తూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  6 Jun 2022 4:29 AM GMT
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణ‌లో కూడా..

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు పలుకరిస్తూ ఉన్నాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, కర్నూలు జిల్లాలో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా ఆలూరులో భారీ వర్షం కురిసింది. ఆలూరు సమీపంలో వాగు దాటుతుండగా ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. కారులో నలుగురు లేదా ఐదు మంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు గుంతకల్లు నుంచి ఆలూరు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కల్లివంక వరద ప్రవాహం వల్ల ఆలూరు నుంచి గుంతకల్లు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కారు సమాచారం గురించి గుంతకల్ ఆలూరు మధ్యలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

కడప జిల్లాలోని పులివెందులలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. విశాఖ ఏరియాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి వర్షం పడుతోంది. సూర్యాపేటలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు విద్యుత్​ స్తంభాలు పడిపోయాయి. బూర్గంపాడు ఏరియాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

తెలంగాణలో నేడు అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిన్న సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Next Story
Share it