తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం
రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణశాఖ వివరించింది.
By Srikanth Gundamalla Published on 29 March 2024 8:00 AM ISTతెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే జనాలు కాలు బయటపెట్టలేని విధంగా భానుడి భగబగలు ఉన్నాయి. ఇక మధ్యాహ్నం అయ్యే సరికి ఎండలు ముదురుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అధికం అవుతున్నాయనీ.. ఐదు రోజుల పాటు ఉష్ణోగత్రలు మరింత భారీగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణశాఖ వివరించింది. అయితే.. తెలంగాణలోని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో గురువారం అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్‌లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత, కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో 42.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దాంతో.. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఎండలు అధికంగా కనిపిస్తున్నాయి. దాంతో.. వాతావరణశాఖ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 నుంచి 2.9 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే.. నంద్యాలలో అధికంగా 42 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. కర్నూలులో 41.9, కడప 41.2, అనంతపురంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి.