కేర‌ళ‌ను తాకిన రుతుపవనాలు

Southwest Monsoon has set in over Kerala. సాధారణం కంటే మూడు రోజులు ముందుగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి.

By Medi Samrat  Published on  29 May 2022 8:52 AM GMT
కేర‌ళ‌ను తాకిన రుతుపవనాలు

సాధారణం కంటే మూడు రోజులు ముందుగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో జూన్ 1 నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వేసవి నుంచి ఉపశమనం కలిగించే విధంగా దేశంలో అక్క‌డ‌క్క‌డ‌ గత పది రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక‌ నైరుతి రుతుపవనాల ప్రవేశంతో మరో రెండు రోజుల్లో దేశ‌మంత‌టా ఓ మోస్త‌రు వర్షాలు కురువ‌నున్నాయి.

దేశంలో రుతుపవనాలు మొదట కేరళలో ఎంట్రీ ఇవ్వ‌డం ద్వారా వ‌ర్షాకాలం ప్రారంభ‌మ‌వుతుంది. మొద‌ట జూన్ 1 నుంచి రుతుపవనాల కదలికలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేర‌ళ‌ను తాకాయి. జూన్ మధ్యలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావ‌ర‌ణ శాఖ‌ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు దేశం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఇదిలావుండగా.. ఉత్తర కర్ణాటకలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉండి కర్ణాటక పొరుగు ప్రాంతాలు విస్తరిస్తున్నందున రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన‌ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.















Next Story