బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

నేడు, రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

By -  Knakam Karthik
Published on : 17 Nov 2025 7:19 AM IST

Weather News, Andrapradesh, Rain Alert, Heavy Rains, Another low pressure, AP Disaster Management Organization

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీర సమీపంలో శనివారం ఒక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో బుధవారం వరకు తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే సోమవారం, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలకు అధిక అవకాశాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అయితే తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.

రేపు(మంగళవారం) కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాల అవకాశముండగా, ప్రకాశం,శ్రీసత్యసాయి,వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 35-55కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మత్స్యకారులు సోమవారం వరకు సముద్ర వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో,ఈ నెల 21వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. దాని ప్రభావంతో 24 నుండి 27 వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Next Story