తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదు అయ్యాయి. గరిష్టంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. మూసాపేటలో గరిష్ఠంగా 41 డిగ్రీలు నమోదు అయ్యింది.
ఇదిలా ఉంటే.. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో తీవ్ర వడగాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, 139 మండలాల్లో వడగాలులు.. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నిన్న నంద్యాల జిల్లా గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 43.3 డిగ్రీలు, ఆముదాలవసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.
వీలైనంతవరకు ప్రజలు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చల్లని పానీయాలు తాగాలని సూచించారు. మజ్జిగ తాగితే మంచిదని సూచించారు. వడదెబ్బ తగిలే అవకాశాలున్నాయని చెబుతున్నారు.