తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెదక్ జిల్లా టేక్కాల్‌లో 16.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇకనైనా వరుణుడు కరుణిస్తాడని బావించగా.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, భువనగిరి, సంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.