గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ బుధవారం కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.
జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం సాయంత్రం బులెటిన్‌లో పేర్కొంది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం సమయానికి కుమురం భీమ్‌లోని జైనూరులో అత్యధికంగా 17.9 సెంటీమీటర్లు, కరీంనగర్‌లోని ఆర్నకొండలో 17.8 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా కనుకులలో 117.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.